అచ్చం నాన్నలా..

31 May, 2019 04:25 IST|Sakshi

చేతికి తండ్రి వాచీ.. నాన్న పెన్నుతోనే సంతకం 

వైఎస్‌ బాటలోనే సంక్షేమ అజెండాతో తొలి సంతకం

మహానేత శైలిలోనే హావభావాలు, ప్రసంగం తీరు

ఆద్యంతం వైఎస్‌ను జ్ఞప్తికి తెచ్చిన సీఎం జగన్‌

తండ్రికి తగ్గ తనయుడంటూ అభిమానుల హర్షం

చేతికి తండ్రి వాచీ.. నాడు ఆ మహానేత ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన పెన్నుతోనే ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా తొలి సంతకం.. వేదికపై ఆద్యంతం దివంగత వైఎస్సార్‌ శైలిలోనే హావభావాలు.. ప్రసంగం తీరు సైతం ఆయన్నే జ్ఞప్తికి తెస్తూ సాగిన వైనం పార్టీ శ్రేణులు, అభిమానులను ఆకట్టుకుంది. నవ్యాంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ అడుగడుగునా తన తండ్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చారు. సీఎం జగన్‌ హావభావాలు, మాట విరుపు, ప్రసంగం, తొలి సంతకం, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం.. ఇలా అన్నీ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తలపించాయి.2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారానికి, గురువారం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారానికి మధ్య ఎన్నో సారూప్యతలు కనిపించాయి.

పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు వచ్చిన వైఎస్‌ జగన్‌ స్టేడియంలో ఓపెన్‌ టాప్‌ జీపులో తిరుగుతూ గ్యాలరీలో కూర్చున్న అశేష అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు హర్షధ్వానాలు చేస్తుండగా ముకుళిత హస్తాలతో చిరునవ్వులు చిందిస్తూ స్డేడియం చుట్టూ కలియదిరిగారు. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ శాస్త్రి స్టేడియంలో ఓపెన్‌టాప్‌ జీపుపై కలియదిరిగి అభివాదం చేసిన దృశ్యాలు అభిమానుల కళ్లల్లో కదలాడాయి. వైఎస్సార్‌ వాడిన వాచీని ఇన్నేళ్లూ ఎంతో అపురూపంగా పదిల పర్చుకున్న వైఎస్‌ జగన్‌ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టేవేళ గురువారం చేతికి కట్టుకోవడం అందర్నీ ఆకట్టుకుంది.

2004 తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్‌ తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పైలుపై తొలి సంతకం చేశారు. అదే విధంగా ఇప్పుడు వైఎస్‌ జగన్‌ తన ఎన్నికల మేనిఫెస్టో అమలుకే తొలి సంతకం చేశారు. నవరత్నాల్లో భాగంగా పేర్కొన్న అవ్వాతాతలు, వితంతువులకు ఫించన్‌ను దశలవారీగా నెలకు రూ.3 వేల వరకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో పింఛన్లను నెలకు రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేయడం విశేషం. కాగా, 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేసిన మాంట్‌బ్లాంక్‌ పెన్నునే గురువారం సీఎం జగన్‌ కూడా వాడటం విశేషం.   

సంక్షేమమే జెండా.. అజెండా
పేదలకు మేలు చేసే విషయంలోపార్టీలు, రాజకీయాలు చూడకూడదన్నది మహానేత వైఎస్‌ నమ్మి, ఆచరించిన విధానం. టీడీపీకి చెందినవారితోపాటు అన్ని వర్గాల వారికి సాచ్యురేషన్‌ విధానంలో ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటను అనుసరించారు. అవ్వా తాతలు, వితంతువులకు పింఛన్లను నెలకు రూ.2 వేల నుంచి దశల వారీగా రూ.3 వేల వరకు పెంచేందుకు నిర్ణయించారు. అందులో తొలి దశగా రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేశారు. రానున్న మూడేళ్లలో వరుసగా రూ.2,500, రూ.2,750, రూ.3 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ విషయంలో అర్హులే అజెండా అని చెప్పారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడం అని చెప్పారు. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపుతట్టి మరీ ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ చేస్తాం అని అశేష అభిమానుల హర్షధ్వానాల మధ్య జగన్‌ ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ మాట తీరు చూసి.. ‘ఎంతైనా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకు కదా.. అందుకే అంతటి గొప్ప మనసు ఉంది’ అని సభికులు మాట్లాడుకోవడం కనిపించింది.

నాన్న శైలిలోనే ప్రసంగం
సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తొలి ప్రసంగం ఆసాంతం ప్రసంగించిన తీరు, హావభావాలు అన్నీ కూడా ఆ మహానేత శైలిలోనే ఉండటం అందర్నీ ఆకట్టుకుంది. ప్రసంగించేందుకు మైక్‌ వద్దకు రాగానే.. వైఎస్‌ మాదిరిగానే సీఎం జగన్‌ కూడా మైక్‌పై మెల్లగా టక్‌ టక్‌ టక్‌మని తడుతూ చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ కళ్లతోనే పలకరించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తన సహజశైలిలో ‘అవ్వలు, అక్కలు, చెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా’ అని అంటూ తన తండ్రి వైఎస్‌ శైలిలో రెండు చేతులు ఎత్తి నమస్కరించడంతో సభికులందరి కళ్ల ముందు ఒక్కసారి ఆ మహానేత సాక్షాత్కరించినట్లు అనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన హావభావాలు... రెండు చేతులు చాచి మాట్లాడటం.. అంతలోనే రెండు చేతులు ఎదురుగా చూపుతూ మాట్లాడటం పూర్తిగా వైఎస్‌నే జ్ఞప్తికి తెచ్చింది. జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఆయన మనసులో స్వచ్ఛత, మాటల్లో స్పష్టత గోచరించాయి. స్వచ్ఛతతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది.

మరిన్ని వార్తలు