బాబుకు అధికారమిస్తే.. చెవిలో క్యాబేజీ పెడతాడట : వైఎస్‌ షర్మిల

3 Apr, 2019 21:15 IST|Sakshi

సాక్షి, పెడన: ‘అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోంది. కానీ, అయిదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు అక్కడ ఒక్కటంటే ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు. ఒక్క ఫ్లైఓవర్‌ కూడా వేయలేదు. రాజకీయంగా అనుభవం ఉంది.. అమరావతిని గొప్ప రాజధాని చెస్తా అని గొప్పలు చెప్పిన బాబు అనుభవం దేనికి పనికొచ్చింది. దోచుకోవడానికి పనికొచ్చిందా..? అమ్మకు అన్నం పెట్టనోళ్లు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారట. ఇంకొకసారి అధికారం ఇస్తేనట.. అమరావతిని అమెరికా చేస్తాడట.. శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తాడట.. మన చెవిలో పూలు.. క్యాబేజీలు కూడా పెడతాడట’ అని చంద్రబాబు పాలనను  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎండగట్టారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంకా ఏం మట్లాడారంటే...

‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికీ భరోసా ఉండేది. కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందేది. ఫోన్‌ చేస్తే చాలు ఇరవై నిముషాల్లో 108 వచ్చేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని వైఎస్సార్‌ తపనపడేవారు. అయిదేళ్ల పాలనలో ఒక్క రూపాయి చార్జీ పెంచకుండా.. పన్నులు పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. ఓటు వేసేముందు ఒక్కసారి వైఎస్సార్‌ను తలచుకోండి. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్న సీఎం కావాలి. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్‌ గుర్తుకు వేసి..  వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన ఉప్పల రాంప్రసాద్‌ సేవల్ని మరిచిపోం. ఆయనను పైకి తెచ్చుకుంటాం. జగనన్న తప్పకుండా న్యాయం చేస్తాడు’ అని అన్నారు.

‘చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను, డ్వాక్రా మహిళలను, విద్యార్థులను, ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు వారిని వంచించారు.  డ్వాక్రా మహిళలను ఒక్క రూపాయి వడ్డీ కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న చంద్రబాబు దానికి తూట్లు పొడిచారు. వైఎస్సార్‌ హయంలో ఉన్నట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందా?. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. ఏదైనా జబ్బొస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారా..? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సామాన్య ప్రజానీకం గురించి ఇలాగేనా ఆలోచించేది’ అని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు