‘హోదా’ వంచకులకు బుద్ధి చెప్పాలి 

3 Jul, 2018 01:26 IST|Sakshi
అనంతపురంలో నిర్వహించిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ప్రసంగిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. వేదికపై పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు...

‘వంచనపై గర్జన’లో ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతల పిలుపు 

చంద్రబాబు ఓ తెలివైన మోసగాడు ∙ఈసారి ఆయన చేతిలో మోసపోవద్దు 

అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ అనంతపురం అర్బన్‌/అనంతపురం అగ్రికల్చర్‌: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను వంచించిన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. విభజన సంద ర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల న్నింటీనీ అమలుచేయాల్సిన చట్టపరమైన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందని.. అలాగే, హోదా సాధించుకోవాల్సిన కర్తవ్యం టీడీపీ ప్రభుత్వాని దన్నారు. అయితే, ఈ రెండూ తమ ధర్మం నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు.

హోదాపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ అనంత పురం జిల్లా కేంద్రంలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన 3వ ‘వంచనపై గర్జన’ దీక్షలో ప్రసంగించిన పలువురు నేతలు ప్రత్యేక హోదా సాధించాలన్న తమ ఆకాంక్ష తిరుగులేనిదని, తుదికంటూ పోరాడి విజయం సాధించి తీరుతామని పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్తేజితులను చేశారు. కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ గర్జనకు భారీఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. పదవీ త్యాగం చేసిన పార్టీ తాజా మాజీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. అంతకుముందు.. ఉ. 9 గంటలకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. సా.4 గంటలకు ముగించారు. 7 గంటల పాటు సాగిన ఈ గర్జనలో నేతల ఉపన్యాసాలు ఆద్యంతమూ ప్రజలను ఆకట్టుకున్నాయి.

నాలుగేళ్లుగా ఏం చేశారు?
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయకుండా నాలుగేళ్లుగా ఏం చేశారు? ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలంటూ ఎందుకు బయలుదేరారు? అని వక్తలు సీఎంను నిలదీసినపుడు సభికుల నుంచి హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు చేసే దీక్షలో ధర్మం లేదు.. పోరాటం అంతకంటే లేదు.. ఇదంతా తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న దీక్షలే అని అంటున్నప్పుడు ప్రజలు పెద్దగా ఈలలు వేస్తూ స్వాగతించారు. చంద్రబాబు చాలా తెలివైన మోసగాడని, సమయాన్ని బట్టి ప్రజలను మభ్యపెట్టడంలో ఆయనది అందె వేసిన చేయి అని నేతలు దుయ్యబట్టినప్పుడు కూడా చప్పట్లు మార్మోగాయి. నాలుగేళ్ల విలువైన కాలంలో ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఆ నిందలను కేంద్రంపై వేస్తూ ప్రజలను మరోసారి వంచించడానికి వస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మోసపోరాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రజలను కోరారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. తాను మోదీ చేతిలో దారుణంగా మోసపోయానని చెప్పుకోవడం క్షమించరాని నేరమని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, చంద్రబాబు 40ఏళ్ల అనుభవం బీజేపీ చేతిలో మోసపోవడానికి పనికి వచ్చిందా? ఇది నాలుగేళ్ల తరువాత తెలిసి వచ్చిందా? అని నాయకులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేనిదే ఆంధ్రప్రదేశ్‌ మనుగడ కష్టమని, అందుకే వచ్చే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వాన్నైనా ఒత్తిడి చేసి హోదా సాధించుకోవచ్చన్నారు. 

‘అనంత’ గర్జించాలి
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు చేసినా.. ప్రజలకు జగన్‌పై ఆదరాభిమానాలు మెండుగా ఉన్నా 2014 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగాను రెండింటిలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించారని వక్తల్లో కొందరు ప్రస్తావిస్తూ.. ఈసారి జరిగే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి, అసమర్థ, వంచన పూరిత పాలనపై గర్జించాలని.. జిల్లాలోని 14కు 14 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరినపుడు సుమారు ఒకటిన్నర నిమిషంసేపు ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అరుపులు, ఈలలు, కేరింతలతో కూడిన ఆమోదం లభించింది. రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన ఒక్క అబద్ధపు హామీ కష్టాల్లో ఉన్న రైతాంగంపై బాగా పనిచేసిందని అందుకే 2014 ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేశారన్నారు. జగన్‌ కూడా అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, అలాంటి తప్పుడు హామీ ఇవ్వడానికి జగన్‌ అంగీకరించలేదని నేతలు వివరించారు. దీక్షలో లభించిన స్పందన ప్రజల ఆలోచనల్లో మార్పునకు అద్దంపడుతోందని వారు పేర్కొన్నారు. 

చేయీ చేయీ కలుపుదాం జగన్‌ను సీఎం చేద్దాం
కాగా, దీక్ష సాగినంత సేపూ ప్రాంగణం మొత్తం సాధారణ ప్రజలతో కిటకిటలాడింది. వేదికపై దీక్ష చేస్తున్న నేతలకు సంఘీభావం తెలపడానికి జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. నగరంలో దాదాపుగా అన్ని వార్డుల నుంచీ పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు, యువత వచ్చారు. మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వేదికపైకి వచ్చి దీక్ష మధ్యలో దివంగత వైఎస్‌ చిత్రపటానికి భారీ పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చేయీ చేయీ కలుపుదాం.. జగనన్నను సీఎం చేసుకుందాం.. వైఎస్సార్‌ అమర్‌ రహే! జై జగన్‌! చంద్రబాబు నయవంచక పాలన నశించాలి! మోసం.. మోసం.. చంద్రబాబు పాలన వట్టి మోసం అనే నినాదాలు చేసుకుంటూ జనం దీక్షా స్థలికి తరలివచ్చారు. దీంతో అనంతపురం నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోలాహలమైన వాతావరణం కనిపించింది. కాగా, కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

రైతు కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఇదిలా ఉంటే.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వేపచర్ల తండాకు చెందిన రైతు కేశవనాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను పార్టీ తరఫున అందిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి సభలో ప్రకటించారు. 

ప్రతి ఇంటికీ ఏటా రూ.లక్ష నుంచి ఐదు లక్షల లబ్ధి
– ‘వంచనపై గర్జన’ సభలో నవరత్నాల పోస్టర్లు ఆవిష్కరణ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏడాదికి ఎంతలేదన్నా రూ. ఒక లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి కలుగుతుందని పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి రూపొందించిన నవరత్నాల పోస్టర్లను నేతలు ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆవిష్కరించారు.  ప్రజాసంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ ‘నవరత్నాల’ పేరిట వైఎస్సార్‌ రైతు భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ ఆసరా, మద్యపాన నిషేధం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు, జలయజ్ఞం వంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. 
దీక్షలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు 

వంచనకు గురిచేసిన చంద్రబాబు, మోదీ 
రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ఇద్దరూ నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను వంచించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తారని రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే వారి ఆశలను అడియాశలు చేశారు. వైఎస్‌ హయాంలోనే 80శాతం పూర్తయిన హంద్రీ–నీవా ప్రాజెక్టు ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేని దుస్థితిలో ఉంది. 
– అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ, ‘అనంత’ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు 

రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నా 
రాష్ట్రాభివృద్ధి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నా. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి. హోదా వద్దని.. ప్యాకేజీ ముద్దు అని ఆయన చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం. రైతులు, మహిళలు, యువకులతో పాటు అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. దేవుడిని రోజూ ఎలా తలుచుకుంటామో అలాగే తనను తలచుకునేలా దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలుచేశారు. మీ నాలుగేళ్ల పాలనలో ఏం సాధించారు చంద్రబాబు? ఒక్కసారైనా స్వతంత్రంగా సీఎం అయ్యారా!?
– వరప్రసాద్, మాజీ ఎంపీ

చంద్రబాబు నయవంచకుడు 
ప్యాకేజీయే లాభమంటూ రాష్ట్ర ప్రజలను మోసగించి హోదా కోసం పోరాటం చేసిన వారిపై కేసులు నమోదు చేయించి మానసిక క్షోభకు గురిచేసిన నయవంచకుడు చంద్రబాబు. ప్రజల కోసం నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపీ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ స్థానాలతోపాటు 14 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం.  
– మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌  

వైఎస్‌ జగన్‌ కష్టం వృథా కాకూడదు 
ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి మాటలు చెబుతూ గాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న కష్టం వృథా కాకూడదు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
– వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు

దళితులను మోసగించారు 
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారు. భావితరాలను కాపాడుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి హోదా కోసం ఉద్యమిస్తున్నారు. హోదాతో ఏం లాభమని చెప్పిన చంద్రబాబు ఈరోజు జగన్‌ బాట పట్టారు. దళితుల కోసం టీడీపీ చేపడుతున్న దళిత తేజం వాస్తవానికి దళితులను వంచించే తేజం. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కాజేశారు. 
– మేరుగ నాగార్జున ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాని, సీఎం విఫలం 
రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను నెరవేర్చడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. నాలుగేళ్లు రెండు పార్టీలు కలిసి కాపురం చేసి ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నానికి తెర తీస్తున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా అధికారంలో ఉన్న నాలుగేళ్లు పట్టించుకోలేదు. ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ అమలుచేస్తామని చెప్పి దానినీ పట్టించుకోలేదు? ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించే వైఎస్‌ జగన్‌ తొలి నుంచి పోరాడుతున్నారు. జగన్‌ ఉద్యమాలను రెండు పార్టీలు హేళన చేశాయి. ఉద్యమకారులపై కేసులు బనాయించారు.  
– బొత్స సత్యనారాయణ, పార్టీ సీనియర్‌ నేత

‘అనంత’ ఉద్యమ స్ఫూర్తితో హోదా సాధిస్తాం  
అనంతపురం జిల్లా ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేస్తాం. చంద్రబాబు చేస్తున్న మోసాలు, దాష్టీకాలు, అన్యాయాన్ని చూస్తున్న రాష్ట్ర ప్రజలు టీడీపీని ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారు. అందుకే జగన్‌ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం వెంటాడుతోంది. హోదా అవసరమే లేదంటూ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు.    
– భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే 

మోసకారి చంద్రబాబు
చంద్రబాబు ఒక మోసకారి. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. హోదా రాకపోవడంలో మొదటి ముద్దాయి మోదీ అయితే రెండో ముద్దాయి చంద్రబాబు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. దీక్షలు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించి యువతలో చైతన్యం తెచ్చారు. హోదా సంజీవనా? అన్న చంద్రబాబే ఈరోజు హోదా పల్లవి అందుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేం ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశాం. దాన్ని కూడా వక్రీకరించిన దుర్మార్గుడు చంద్రబాబు.     
    – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ 

మరిన్ని వార్తలు