సమర భేరి

12 Mar, 2019 04:45 IST|Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి

ప్రజాపోరాటాలు, పాదయాత్ర విజయవంతంతో సమరోత్సాహంతో వైఎస్సార్‌సీపీ

అధినేత జగన్‌ ప్రజాదరణ, విశ్వసనీయతే ఇరుసుగా ఎన్నికల రణక్షేత్రంలోకి..

ప్రభుత్వ వైఫల్యాలు,చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న టీడీపీ

ఉనికి కోసం బీజేపీ,కాంగ్రెస్‌ పాట్లు 

రాష్ట్రంలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెర లేచింది. ఎన్నికల షెడ్యూల్‌ ఆదివారం విడుదల కావడంతో ఎన్నికల కురుక్షేత్రంలో తలపడేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పోలింగ్‌కు నెలరోజులే సమయం ఉంది.దాంతో రాష్ట్రంలో ఎన్నికల సమరం 20: 20 క్రికెట్‌ మ్యాచ్‌ను తలపించే రీతిలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనుందని స్పష్టమైంది. ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన ప్రధాన రాజకీయ పార్టీలు..అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వామపక్షాలతో పొత్తు పెట్టుకొని జనసేన తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుందా...ఇంకే ఆలోచనలేమైనా చేయనుందా? అన్నది చూడాల్సి ఉంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రంలో రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. అన్ని పార్టీలూ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించి ప్రచారం పర్వంలోకి దిగడానికి సంసిద్ధమవుతున్నాయి.


సమరోత్సాహంతో వైఎస్సార్‌ సీపీ 
పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణ, విశ్వసనీయతను ఇరుసుగా చేసుకుని ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. సందేహాలకు తావులేకుండా వైఎస్‌ జగన్‌ మొదటి నుంచీ స్పష్టత ఇస్తున్నట్లుగానే..ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రత్యేక హోదా,  విభజన డిమాండ్ల సాధనతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి మడమ తిప్పకుండా  ప్రజా పోరాటాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఐదేళ్లపాటు ప్రజాక్షేత్రంలోనే గడిపింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తూ.. ప్రజాసమస్యల పరిష్కారం, రాజ్యాంగ  విలువల పరిరక్షణ కోసం శాసనసభ లోపలా, బయటా అలుపెరుగని పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన చరిత్రాత్మక ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టడం భవిష్యత్‌ రాజకీయాలకు సూచికగా నిలిచింది.

పాదయాత్ర అనంతరం నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకుల నియామకం, ఇతరత్రా ఏర్పాట్లలో పార్టీ యంత్రాంగం తలమునకలై ఉంది. అధికార టీడీపీకి చెందిన ప్రజాప్రతి నిధులతోపాటు సీనియర్‌ నేతలు, తటస్థులు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతుండటం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది. అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీ ప్రధానాంశగా పార్టీ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు విశ్లేషిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో త్వరలోనే అభ్యర్థులను, మ్యానిఫెస్టోను ప్రకటించి.. ప్రచార పర్వంలోకి దిగాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. పార్టీ ప్రచారం కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అధినేత వైఎస్‌ జగన్‌ ప్రధాన ఆకర్షణగా పార్టీ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఆయనతోపాటు సీనియర్‌ నేతలు, సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా పార్టీ విధానాలు, సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది పార్టీ వ్యూహంగా ఉంది. 

పటిష్టమైన నిర్మాణ బలంతో పోరుకు
పటిష్టమైన పార్టీ నిర్మాణ బలం, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడిన స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై నిర్విరామంగా పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా పార్టీని జగన్‌ తీర్చిదిద్దారు.  విశ్వసనీయతకు మారుపేరుగా ప్రజల్లో ముద్ర వేసుకున్న జగన్‌.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నికల రంగానికి పార్టీ నేతలను, శ్రేణులను నడిపిస్తున్నారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ప్రత్యేక హోదాను నిర్లక్ష్యం చేయడం పై  ఆయన ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విశేషంగా కృషిచేశారు. జగన్‌ 14 నెలలపాటు సుదీర్ఘంగా చేసిన ప్రజాసంకల్పయాత్ర 13 జిల్లాల్లోనూ పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. ఇదే సమయంలో జనరంజక పాలన అందించే నాయకత్వ పటిమ తనలో ఉందనే విశ్వాసాన్ని ప్రజల్లో పాదుగొల్పారు. నిత్యం పాదయాత్రలో ఉన్నా.. పార్టీ నిర్మాణంపై జగన్‌ దృష్టిని పెట్టారు. ఎప్పటికప్పుడు పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ చేసిన వ్యూహ రచనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బూత్‌ కమిటీల నిర్మాణాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవంతంగా పూర్తి చేయగలిగింది. పార్టీ నిర్మాణం బలంగా లేక పోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. ఈసారి అలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్‌ కృషి వల్ల ప్రతి జిల్లాల్లోనూ ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచీ పార్టీకి బలమైన కేడర్‌ ఏర్పడింది. 13 జిల్లాల్లోనూ 4 లక్షల మంది బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలనే అస్త్రాలుగా మలిచి కార్యకర్తలను నిత్యం పోరు బాటలో నిలపడంలో జగన్‌ సఫలీకృతులయ్యారు. కీలకమైన తన పాదయాత్ర ముగిసే నాటికే పార్టీ శ్రేణులను ఆయన ఎన్నికల సమరం దిశగా కార్యోన్ముఖులను చేశారు. హోదా సాధనలో టీడీపీ చేసిన వంచన, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘వంచనపై గర్జన’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలు, అడుగడుగునా చేసిన పోరాటాలు ఆ పార్టీకి గట్టి జవసత్వాలను ఇచ్చాయి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో జిల్లాల వారీగా కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న సమరశంఖారావం కార్యక్రమాలు బ్రహ్మాండమైన రీతిలో విజయవంతం అవుతూ పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగిస్తున్నాయి. ఇపుడు ప్రతి జిల్లాలోనూ 20 వేల నుంచి 30 వేల మంది వరకూ క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ కోసం శ్రమించే సైనికులాంటి కార్యకర్తలు ఉన్నారు.

తెరవెనుక పొత్తులతో టీడీపీ
కొద్దిరోజులుగా అధికార టీడీపీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. కాగా చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం ఆ పార్టీకి ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ప్రత్యేక హోదా విషయంలో మొదట రాజీపడటం.. నాలుగేళ్ల తర్వాత యూటర్న్‌ తీసుకోవడం.. రాజధాని నిర్మాణంలో వైఫల్యం..సంక్షేమం పడకేయడం.. అభివృద్ధి జాడ కనిపించకపోవడం.. విపరీతమైన దుబార.. వంటి కారణాలతో టీడీపీపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా టీడీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ప్రజలు గుర్తించారు. తాజాగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల రాజీనామాల పరంపరం కొనసాగుతుండటం చంద్రబాబును మరింత కలవరపరుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఇంతవరకు ఒంటరిగా పోటీ చేసి గెలవలేదన్నది చారిత్రక సత్యం.

ఈసారి ఒంటరిగా పోటీ చేయకతప్పదా..? అనే ఆలోచన ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకు తగ్గట్లుగానే జనసేన, కాంగ్రెస్‌లతో లోపాయికారీ పొత్తుతో ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధికారికంగా ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నా..   కాంగ్రెస్‌కు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిధులు సమకూర్చేలా.. ప్రతిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరోక్షంగా టీడీపీకి సహకరించేలా లోపాయికారీ ఒప్పందం కుదిరింది. ఆ దిశగానే జనసేన, కాంగ్రెస్‌లకు కొన్ని స్థానాల్లో ప్రయోజనం చేకూర్చాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కొన్ని రోజులుగా ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. 

తొలిసారి ఎన్నికల బరిలోకి జనసేన
జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల రణరంలోకి దిగనున్నట్లు వెల్లడించింది. 2014 ఎన్నికల నాటికే పార్టీని స్థాపించినప్పటికీ..ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇదివరకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏం జరుగుతుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ నెల 14న రాజమండ్రిలో నిర్వహించే బహిరంగ సభతో ఎన్నికల రంగంలోకి దిగాలని జనసేన భావిస్తోంది.

జనసేన పొత్తుతో వామపక్షాలు
సీపీఎం, సీపీఐ పార్టీలు ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకొని ఎన్నికల రంగంలోకి దిగనున్నాయి. ఐదేళ్లుగా వామపక్ష పార్టీలు తమదైన శైలిలో ఉనికి చాటుకుంటూ వచ్చాయి. కాగా ఎన్నికల అంశం వచ్చే సరికి ఆ పార్టీలు జనసేనతో పొత్తు వైపే మొగ్గు చూపాయి. అయితే వామపక్షాలు, జనసేన మధ్య సీట్ల పంపకం ఎలా ఉంటుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఎన్నికల పొత్తు, సీట్ల పంపకంపై జనసేతో వామపక్ష నేతలు ఇప్పటికే రెండుమూడుసార్లు చర్చించారు. కానీ సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోలేదు. సీపీఎం, సీపీఐ కలిపి 30 వరకు అసెంబ్లీ స్థానాలు కోరే అవకాశముందని సమచారం. దీనిపై జనసేన వైఖరి ఏమిటన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

రాజకీయ ఎదుగుదల కోసం బీజేపీ 
జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్రంలో తమ బలం ఏపాటిదో నిరూపించుకోవడానికి సిద్ధమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. టీడీపీ వైఖరి వల్ల బీజేపీ  రాష్ట్రంలో సరైన స్థాయిలో ఎదగలేకపోయిందన్నది వాస్తవం. 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో ఓట్లు తెచ్చుకున్న బీజేపీ.. ఆ తరువాత టీడీపీతో పొత్తుతో అనుకున్న రీతిలో పుంజుకోలేకపోయింది. సొంతంగా బలపడేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 1999, 2004లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. 2009లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ.. మళ్లీ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మళ్లీ మిత్రబేధం రావడంతో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుంది.  ఇక రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ మూలాలతోసహా తుడుచి పెట్టుకుపోయింది. దాంతో ఈ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడం కూడా ఆ పార్టీకి గగనమే. తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీతో బహిరంగ పొత్తుపెట్టుకుని దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో లోపాయికారీ పొత్తు్తకు పచ్చజెండా ఉపింది. దాంతో కనీసం ఉనికి దక్కకపోతుందా.. అని ఆ పార్టీ భావిస్తోంది .
– సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు