దళితుల ఓటు హక్కు కాలరాశారు: చెవిరెడ్డి

16 May, 2019 18:24 IST|Sakshi

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కోరారు. తిరుపతిలో చెవిరెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోలింగ్‌ రోజు సీసీ ఫుటేజీ పరిశీలించండి.. పట్టించుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాను.. ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు రీపోలింగ్‌కు అనుమతించారు. ప్రత్యేక  పోలింగ్‌ కేంద్రాలు దళితులకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దళితులు, గిరిజనుల ఓటు హక్కును 30 సంవత్సరాలుగా కాలరాశార’ని వ్యాఖ్యానించారు.

‘పోలింగ్‌ రోజు జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి, కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏప్రిల్‌ 13 నుంచి పోలింగ్‌ రోజు జరిగిన అన్యాయంపై పోరాటం సాగిస్తున్నాం. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేశాం.. ఐదు పోలింగ్‌ కేంద్రాలకు మాత్రమే రీపోలింగ్‌కు అనుమతించారు. 27 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపించాలని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆధారాలు ఉంటే చూపించండి. రీపోలింగ్‌ జరుగుతున్న పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగిన రోజు అన్ని ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. నా స్వగ్రామం తుమ్మలగుంటలో అక్రమాలు జరిగినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి.. నేను రీపోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాన’ని టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

 సీఎం పేషీలో పనిచేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్‌ స్వామి భక్తితో ఏకపక్షంగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించారని ఆరోపించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం

మరిన్ని వార్తలు