కాంగ్రెస్‌ను కౌగిలించుకుంటే తప్పనిపించడం లేదా?

18 Jan, 2019 20:01 IST|Sakshi

కాకినాడ: కాంగ్రెస్‌తో జతకట్టి మరోసారి ఎన్టీఆర్‌ ఆత్మను వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. ఆనాడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇవాళ మరోసారి ఎన్టీఆర్‌ ఆత్మను వెన్నుపోటు పొడిచారన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. ‘కేసీఆర్ను రాచ మర్యాద లతో రాష్ట్రానికి ఆహ్వానించింది మీరు కాదా?, అమరావతి శంకుస్థాపన కు కేసీఆర్ ను తీసుకువచ్చి సన్మానించారు. కాంగ్రెస్‌ కూటమిలో టీడీపీ కలిసినప్పుడు.. రాష్ట్రంలో ముఖ్య పార్టీ అయిన వైఎస్సార్‌సీపీని మరొకరు ఆహ్వానిస్తే తప్పెలా అవుతుంది. మీరు కాంగ్రెస్‌ను కౌగిలించుకుంటే తప్పనిపించడం లేదా.

మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. నిన్నటి వరకూ చంద్రన్న బాట.. నేడు జగనన్న బాటలో చంద్రబాబు. చంద్రబాబు సర్కారు ఫించన్లు రూ.2వేల పెంపుకు జగనన్న కానుక అని, రైతుల పెట్టుబడి సాయానికి జగనన్న భరోసా అని పేర్లు పెట్టాలి. సొంతంగా ఆలోచించి  పథకాలు ప్రవేశపెట్టలేని  దిగజారుడు నైజం చంద్రబాబుది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పసలేదని చెప్పిన చంద్రబాబు.. ఎన్‌ఐఎ దర్యాప్తును చూసి ఎందుకు వణికిపోతున్నారు. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశం కేంద్రం పరిధిలోనిదని చెప్పిన బాబు.. ఎన్‌ఐఎ విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని కన్నబాబు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు