బీజేపీని చిత్తుగా ఓడించింది మేమే: కేటీఆర్‌

18 Jan, 2019 19:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అశించినంత వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రాన్ని కూడా శాసించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీజేపీ అంటే బిల్డప్‌ జాతీయ పార్టీగా మారిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ కీలక నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒంటేరు చేరికతో టీఆర్‌ఎస్‌ మరింత బలంగా మారిందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసినా కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ రాదని జోస్యం చెప్పారు.

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని, ఆంధ్రాప్రాంతం అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో సోనియా గాంధీని ఇటలీ మాఫీయా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. బీజేపీకీ తమకు ఏదో సంబంధం ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించింది టీఆర్‌ఎస్‌ పార్టీనే అని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు