‘పోరాడితే కేసులా.. మరి హోదా సాధించని బాబు సంగతి’

27 Dec, 2018 14:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్‌ చేశారు.

వైఎస్ జగన్‌ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీ
వైఎస్సార్‌సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు. ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు