‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా​‍’

18 Jun, 2019 13:05 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ.. ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని అన్నారు.  ప్రజాపాలనపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో గవర్నర్‌ ప్రసంగం ద్వారా తెలియజేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఆదాయం తెచ్చే కొత్త మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురానుండటం జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని కోలగట్ల వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతం : వరప్రసాద్‌
పేద ప్రజల సంక్షేమం​ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్సార్‌లా వైఎస్‌ జగన్‌ కూడా ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు నేరుగా చేరడం అభినందనీయం అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసే అరాచకం ఒక ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమని విమర్శించారు.

మరిన్ని వార్తలు