హోదాపై పట్టువీడని ప్రతిపక్షం

10 Mar, 2018 01:26 IST|Sakshi
పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ వేదికగా పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. శుక్రవారం ఉ. 10.30 గంటలకు పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం ఓ డ్రామా, ప్రహసనమని వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందున రాజీనామాలు చేసినట్లు చెబుతున్న టీడీపీ ఎన్డీఏలో కొనసాగటంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేంద్రంపై విశ్వాసం కోల్పోయినందున అవిశ్వాస తీర్మానం పెట్టటంతోపాటు టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలన్నారు. అన్ని పార్టీల రాష్ట్ర ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. 

బాబు డ్రామాను ప్రజలు గుర్తించారు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి హోదా కోసం నాలుగేళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ రెండేళ్ల క్రితం చెప్పిన విషయాన్నే ఈనెల 7వ తేదీన మరోసారి చెప్పారన్నారు. రెండేళ్ల క్రితం జైట్లీకి శాలువా కప్పి సన్మానించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవటాన్ని బట్టి ఆయన డ్రామాను ప్రజలు గ్రహించారని చెప్పారు.

చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి మద్దతివ్వాలి: ఎంపీ వరప్రసాదరావు
ప్రత్యేక హోదా సాధనపై టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వరప్రసాదరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే సరిపోదని, ప్రజలిచ్చిన ఎంపీ పదవులను వీడేందుకు తమ మాదిరిగా సిద్ధంకావాలని సూచించారు. ఎన్డీఏలో కొనసాగడం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 

ఉభయ సభల్లో కొనసాగిన ఆందోళన
శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హోదా కోసం నినదించారు. వివిధ పార్టీల సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు పలుసార్లు వాయిదాపడ్డాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్‌ గజపతిరాజు పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ నిర్వహించిన ధర్నాలో, లోక్‌సభ వెల్‌లో చేపట్టిన ఆందోళనలోనూ పాలుపంచుకున్నారు. పార్టీ ఎంపీ మాగంటి బాబు వెంకటేశ్వరస్వామి ప్రతిమ, భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ గ్రంథాలను ప్రదర్శించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కోయదొర వేషంతో సభకు వచ్చారు. 

మరిన్ని వార్తలు