ఎయిర్‌ కోస్టాకు మళ్లీ రెక్కలు?

10 Mar, 2018 01:28 IST|Sakshi

 ఈ ఏడాదే సేవలు తిరిగి ప్రారంభం!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెక్కలు తెగి ఆగిపోయిన ఎయిర్‌ కోస్టా... మళ్లీ రెక్కలు తొడుక్కోనుందా? 50 విమానాల కోసం ఎయిర్‌ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా రద్దు కాలేదని ఎంబ్రాయిర్‌ సంస్థ స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలు నిజం కావచ్చనే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభం అయిన తొలి విమానయాన సంస్థ ఎయిర్‌ కోస్టా.. నిధుల సమస్యతో 2016 జూలై నుంచి తన సర్వీసులను నిలిపేయటం తెలిసిందే.

సమస్య నుంచి బయట పడేందుకు ఎయిర్‌ కోస్టా ప్రయత్నిస్తోందని ఎంబ్రాయిర్‌ కమర్షియల్‌ ఏవియేషన్‌ ఆసియా పసిఫిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీజర్‌ పెరీరా వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న వింగ్స్‌ ఇండియా 2018లో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో ఈ విషయాలు చెప్పారు.

‘50 విమానాల కోసం ఎయిర్‌ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా మా పుస్తకాల్లో ఉంది. రద్దు కాలేదు. ఆ సంస్థ తిరిగి సర్వీసులు ప్రారంభించవచ్చు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తప్ప ఆర్డరు రద్దు చేయం. ఆ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్య నుంచి బయటపడేందుకు ఎయిర్‌ కోస్టా కృషి చేస్తోంది. ఆ సంస్థ ఆర్డర్లు వేరే కంపెనీకి బదిలీ చేయలేదు’ అని పేర్కొన్నారు.

యెస్‌.. నిజమే: ఎయిర్‌ కోస్టా..
విజయవాడకు చెందిన లింగమనేని గ్రూప్‌ ఎయిర్‌ కోస్టాను ప్రమోట్‌ చేస్తోంది. పెరీరా వ్యాఖ్యలు నిజమేనని ఎల్‌ఈపీఎల్‌ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘మీరు విన్నది నిజమే. త్వరలోనే ఎయిర్‌ కోస్టాకు రెక్కలు రానున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఎంబ్రాయిర్‌తో సంప్రతింపులు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు