‘మే 26న వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారు’

26 Apr, 2019 17:26 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తాటిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అని చెప్పే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌పై లేనిపోని ఆరోపణలతో బాబు హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఈసీనే హెచ్చరించే ధోరణిలో చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. సీఎంగా తాను సమీక్షలు జరుపకపోతే, ఏదైనా జరిగితే ఎన్నికల కమిషన్‌దే బాధ్యత అనడం వెనుక ఆంతర్యమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. అంతేకాకుండా పెరిగిన ఖర్చులను మీ దగ్గరి నుంచే వసూలు చేస్తా అంటూ హెచ్చరించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నెల రోజుల పాటు సమీక్ష చెయ్యకపోతే... ఖర్చులు పెరుగుతాయట.. అసలు చంద్రబాబు ఈ ప్రపంచంలో ఉన్నారో లేదోనని ఆశ్చర్యం వేస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన తపన అంతా.. ఈ నెల రోజుల పాటు దోచుకున్నది దాచుకోవడానికి, మరింతగా దోచుకోవడానికేనని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే పోలవరం రివ్యూలు చేశారని ఆరోపించారు. తాగునీటి సమస్యను మాత్రం కేవలం 2 నిమిషాలే సమీక్ష చేశారనన్నారు.

ఆ లేఖను ఏమనాలో అర్థం కావడం లేదు..
‘ఐదేళ్లలో రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్‌ ఇటుక కూడా వేయలేదు. చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రాజధాని పూర్తయ్యేది కాదా? సీఎం సరైన సమయంలో సమీక్షలు చేయకపోవడం వల్లే పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని లేఖలో రాసుకున్నారు. చంద్రబాబు రాసిన ఆ లేఖ చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. సీఎం సమీక్ష జరిగి ఉంటే ఈ మరణాలు ఆగేవని అంటున్నారు. అసలు ఏమిటిదంతా. ఈ నెల రోజుల్లో బాబు చేసిన సమీక్షలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. దోచుకోగా మిగిలినవి ఏమైనా ఉంటే కొట్టేయడానికే సమీక్షలు’ అని రామకృష్ణారెడ్డి చంద్రబాబు తీరును ఎండగట్టారు.

మాకు పూర్తి విశ్వాసం ఉంది...
‘ఎన్నికల తర్వాత సీఎం రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారు. బిజినెస్ చేసే వాళ్ళ మీద ఐటీ సోదాలు జరగడం సాధారణం. మా పెదకూరపాడు ఎమ్మెల్యే, గుంటూరు ఎంపీ అభ్యర్థి ఇంట్లో సోదాలు జరిగితే... మేము ఏమనలేదు. కేవలం చంద్రబాబు మనుషుల మీదనే జరిగినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టేలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాని నుంచి బయటపడటానికే బాబు నార్త్ టూర్ అంటున్నారు. తన ఓటమికి ఈవీఎంలను కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఉన్న మీడియా, ప్రచార బలం ద్వారా... ప్రజలు ఇదంతా నిజమేనేమో అనుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా... ప్రజలకు వివరాలు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2014లో అత్తెసరు ఓట్లతో బాబు ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడకుండా ఇలా.. గంగవెర్రులు ఎత్తుతున్నారు.  రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది. ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు