భద్రత డొల్ల!

21 Jan, 2018 11:02 IST|Sakshi

బాలసదన్‌పై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఇద్దరు మైనర్‌ వివాహితల ఎస్కేప్‌తో వెలుగులోకి..

సీసీ కెమెరాలకు చిక్కకుండా పరారీ

ఒంగోలు టౌన్‌: బాలసదన్‌లో భద్రత డొల్ల అని తేలిపోయింది. మూడు సీసీ కెమెరాలు, ముగ్గురు సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ ఇద్దరు మైనర్‌ వివాహితులు అక్కడ నుంచి తప్పించుకుపోవడం సంచలనం సృష్టించింది. వారు తప్పించుకుపోయారని చెబుతున్న ప్రాంతాన్ని చూస్తే విస్తుపోవాల్సిందే. మనిషి దూరలేని సందు నుంచి ఇద్దరు బాలికలు  తప్పించుకుపోవడం చర్చనీయాంశమైంది. బాలసదన్‌కు భద్రత, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఇట్టే స్పష్టమవుతోంది.  ఒంగోలు నగరంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ   ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయాన్ని ఆనుకొని బాలసదన్‌ నిర్మించారు. ప్రస్తుతం ఇందులో పదేళ్లలోపు వయస్సు కలిగిన బాలికలు 32 మంది ఉన్నారు. వారంతా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. వారితోపాటు ఇద్దరు బాలికలను ఇటీవల  తీసుకువచ్చారు.

గిద్దలూరుకు చెందిన ఓ బాలిక ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. గత ఏడాది డిసెంబర్‌ చివరి వారంలో ఆమెను తీసుకురాగా ప్రేమ వివాహం చేసుకున్న వేటపాలేనికి చెందిన మరో బాలికను కూడా ఈ ఏడాది జనవరి మొదటి వారంలో తీసుకువచ్చారు. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వీరిద్దరూ శుక్రవారం ఒకేసారి అక్కడ నుంచి తప్పించుకుపోయారు. అంతకు ముందు నుంచి వారు బాలసదన్‌ ప్రాంగణం మొత్తం కలియతిరిగి తప్పించుకునేందుకు పథక రచన చేసుకొని, అధికారులు, సిబ్బంది, తోటి బాలికల కళ్లు గప్పి పారిపోవడంతో సంచలనం కలిగించింది. ఇటీవల ఈ బాలికలను కలిసేందుకు వారి తల్లిదండ్రులు వచ్చారు. పారిపోయేందుకు వారు కూడా ఉపాయం చెప్పి ఉంటారన్న అనుమానాలను ఆ శాఖ అధికారులు వెలుబుచ్చుతున్నారు.

ఇదేనా భద్రత?
బాలసదన్‌లో ప్రస్తుతం 35 మంది బాలికలు ఉన్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత వారు అక్కడే భోజనం చేసి పడుకుంటారు. బాలసదన్‌ ప్రాంగణంలోనే శిశుగృహ ఉంది. ఇందులో ప్రస్తుతం తొమ్మిది మంది శిశువులు ఉన్నారు. శిశుగృహ మొదటి అంతస్తులో ఉంది. అక్కడ ఆరుగురు ఆయాలు, ఒక ఏఎన్‌ఎం, ఒక సోషల్‌ వర్కర్‌ ఉన్నారు. 35 మంది బాలికలు ఉన్న బాలసదన్‌కు మాత్రం తగినంత సిబ్బంది లేరు. ప్రస్తుతం బాలసదన్‌కు సూపరింటెండెంట్, మేట్రిన్, కుక్, వాచ్‌ ఉమెన్, సేవిక, హెల్పర్‌ ఉన్నారు. ఒకొక్కరే ఉండటంతో అక్కడ ఉండే బాలికలకు భద్రత ప్రమాదంలో ఉన్నట్లుగానే ఉంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం కలుగుతోంది. పోలీసు రక్షణ కావాలంటూ ఇక్కడ నుంచి పోలీసు శాఖకు, అగంతకులు చొరబడకుండా ఉండేందుకు చుట్టూ కరెంట్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసే విషయమై మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కానీ, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.

నాలుగు సీసీ కెమెరాలకు మూడే రన్నింగ్‌..
బాలసదన్‌లో నాలుగు సీసీ కెమెరాలకుగాను ప్రస్తుతం మూడు పనిచేస్తున్నాయి. వెనుకవైపు మార్గంలో కూడా ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేసే విషయమై ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇద్దరు బాలికలు పారిపోయిన తరువాత ఆ శాఖ అధికారులు తప్పులను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు.

>
మరిన్ని వార్తలు