బిందె నీరు దొరికితే ఒట్టు!

11 Mar, 2019 09:13 IST|Sakshi
కారికాడులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పక్కనే నిర్మాణంలో ఉన్న సంపు

సాక్షి, దొరవారిసత్రం: వేపవి వచ్చేసింది. అయితే తీర గ్రామాల్లో తాగునీటి సమస్య అలాగే ఉంది. ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు సుమారు 20 ఏళ్ల క్రితం సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామ పరిధిలో నుంచి 18 కి.మీ మేర పైప్‌లైన్లు వేశారు. రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు నిర్మించి తాగునీటి సదుపాయం కల్పించారు. అయితే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురికావడం, ఆబాక ప్రాంతంలో వేసిన బోర్ల వద్ద విద్యుత్‌ సమస్యలు ఏర్పడుతుండడంతో ఏడాది పొడవునా ప్రజలు తాగునీరందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వేసవి కాలంలో మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అరకొరగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటూ వస్తున్నారు. 

నిధులు మంజూరైనా..
గతేడాది తీర గ్రామాల్లో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా రూ.1.16 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి వనరులు లేనందున సుమారు ఆరు కి.మీ దూరంలోని సింగనాలత్తూరు గ్రామ పరిధిలోని చెరువులో బావి తవ్వారు. కారికాడు గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నిర్మించారు. అక్కడే నీటి సంపు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ పనులు ఏడాది నుంచి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా పైపులైన్లు వేసి, వీధుల్లో కుళాయిలు అమర్చాల్సి ఉంది. వేసవి కాలం సమీపించడంతో ప్రస్తుతం ఎక్కడా తాగునీటి వనరులు లేకుండాపోయాయని స్థానికులు వాపోతున్నారు. కారికాడులో మాత్రం పథకం నీరు నూతనంగా నిర్మించిన సంపులోకి వస్తే అక్కడినుంచి పట్టుకుంటున్నారు. వేలికాడు, నాగినేరి గ్రామాల ప్రజలైతే ఊట చెరువుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది.  

హడావుడితో సరి
తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకుల హడావుడి తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎప్పటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారో?.

  -వై.సుబ్రహ్మణ్యం       

ఊటగుంటలోని నీరే దిక్కు:
వేసవి కాలం వస్తే గ్రామ సమీపంలో ఉన్న ఊటగుంట నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సిందే. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునే వారులేరు. మంచినీటి పథకం నీరు కలగానే మిగిలింది.  

  – పి.ఏకాంబరం        

పదిరోజుల్లో పూర్తవుతాయి
నీటి పథకం పనులు పదిరోజుల్లో పూర్తి చేయిస్తాం. నూతనంగా నిర్మాణంలో ఉన్న నీటి పథకం పనులు పూర్తైతే కారికాడు, వేలికాడు, నాగినేరి గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.   – కె.చంద్రశేఖర్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, దొరవారిసత్రం           

మరిన్ని వార్తలు