అర్హులకే భూముల పంపిణీ: కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

అర్హులకే భూముల పంపిణీ: కలెక్టర్‌

Published Sat, Nov 18 2023 12:08 AM

- - Sakshi

తోడేరుకు చెందిన మహిళకు భూ పట్టా అందజేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణమ్మ, జేసీ కూర్మనాథ్‌, సభకు హాజరైన లబ్ధిదారులు

పొదలకూరు: దశాబ్దాల పేద రైతుల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, పేద రైతులకు భూములు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లావ్యాప్తంగా అసైన్మెంట్‌, ఎస్సీ కార్పొరేషన్‌, సర్వీస్‌ ఇనాం, చుక్కల భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పొదలకూరులోని కల్యాణ మండపంలో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, జేసీ కూర్మనాథ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మలతో కలిసి మంత్రి కాకాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. జిల్లాకు సంబంధించి పొదలకూరులో రైతులకు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల చిరకాల ఆకాంక్షను తీరుస్తూ రూ.కోట్లాది విలువైన భూములను అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 6 వేలకుపైగా ఎకరాల అసైన్మెంట్‌ భూములను పంపిణీ చేస్తుండగా, ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 5,023 ఎకరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20,24,709 కుటుంబాలకు భూముల పట్టాలను అందజేస్తున్నామని, జిల్లాలో 5,517 మందికి 6,507 ఎకరాల అసైన్మెంట్‌ భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 20 ఏళ్లుగా అసైన్మెంట్‌ భూములను సాగు చేసుకుంటున్న 21,415 మంది రైతులకు 37,863 ఎకరాల భూములకు, 1,407 మంది రైతులకు 2,565 ఎకరాల చుక్కల భూములకు శాశ్వత భూహక్కులను కల్పిస్తున్నట్లు తెలిపారు. 1,446 మంది రైతులకు 971 ఎకరాల భూములకు, 61 ఎకరాల ఇనాం భూములకు హక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలకు భూములు ఇవ్వడం ఇష్టం లేని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారులను బెదిరిస్తూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెబుతుండడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకే భూములను అందజేశారని, తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులకు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

భూముల పంపిణీ చారిత్రాత్మకం

సీఎం వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం

వ్యవసాయశాఖ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అర్హులైన వారికే భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. జిల్లాలో 25 వేల మంది రైతులకు పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అందజేసే భూముల విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందన్నారు. రెవెన్యూశాఖ పరంగా రైతులకు అన్నిరకాల సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 46 వేల ఎకరాలకు సంబంధించి చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి పట్టాలను అందజేశామని తెలిపారు. మండలాల వారీగా భూపట్టాలను అందజేస్తామన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్‌, నెల్లూరు ఆర్డీఓ ఎ.మలోలా మాట్లాడారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వీరవసంతరావు, వైస్‌ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పెదమల్లు రమణారెడ్డి, రావుల దశరథరామయ్యగౌడ్‌, జేసీఎస్‌ కన్వీనర్‌ బచ్చల సురేష్‌రెడ్డి, సర్పంచ్‌ చిట్టెమ్మ, ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement