అనుమతులు లేని పరిశ్రమలు

11 Jan, 2018 11:12 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో నిర్వహణ

వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడంలో నిర్లక్ష్యం

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ఉదాసీనత ప్రదర్శిస్తున్న స్థానిక అధికారులు

కొత్తూరు ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండానే వెలుస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగే వరకు ఇలాంటి పరిశ్రమలు  కొనసాగుతున్నాయనే విషయం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. స్థానిక అధికారుల ఉదాసీనతతోనే ఇలాంటి పరిశ్రమలు వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి అయా పన్నుల రూపంలో రావాల్సిన లక్షల రూపాయలు కూడా రావడం లేదు. ప్రస్తుతం షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 313 పరిశ్రమలు కొనసాగుతుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు తెలుపుతున్నాయి.  – కొత్తూరు

కొత్తూరు: హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిలో భా గంగా నగర సమీపంలోని కాలుష్యకారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు నోటీసులు అందించారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, వ్యవసాయ భూములను కొనుగోలు తర్వాత ప్రభుత్వానికి నిర్ణీత పన్నులు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ, పదెకరాలు కొనుగోలు చేస్తే కేవలం రెండు, మూడెకరాలు మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉండే అనుమతులు మాత్రమే పొందుతున్నారు. పరిశ్రమల నిర్మాణాలను సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందిస్తే వారు ఆ నిర్మాణాల ఆధారంగా ప్రతి ఏడాది పన్నులు వసూలు చేస్తారు. కాగా నిర్వాహకులు పూర్తిసా ్థయి నిర్మాణ పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే కొనసాగుతోన్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము టీఎస్‌ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్నాం.. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు.  

పట్టించుకోని అధికారులు.....
ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే సంబంధిత శాఖ అధికారులు ఏకంగా పరిశ్రమలను స్థాపించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.  కొత్తూరు మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, అప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలిసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఉన్నతాధికారులకు నివేదిస్తాం...  
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసే పరిశ్రమలు, గోదాముల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమలపై మాకు సమాచారం లేదు.        – సాధన, ఈవోపీఆర్‌డీ, కొత్తూరు.

మరిన్ని వార్తలు