అమరుల ఆశయసాధనకు ఉద్యమించాలి

17 Jan, 2018 11:53 IST|Sakshi

రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలి

ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకటించాలి

రాష్ట్రంలో 3,800 మంది రైతుల ఆత్మహత్య  

సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం

ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి ఆశయ సాధన కోసం మనమంతా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మన బతుకుదెరువు కోసం ఉద్యమించక తప్పదన్నారు. ఆమనగల్లు మండలం కోనాపూర్‌ గ్రామంలో తెలంగాణ విద్యార్థి వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవసభ సోమవారం జరిగింది. తెలంగాణ విద్యార్థి వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ కోదండరాం పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం ఏర్పాటు కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారని, అమరుల ఆత్మబలిదానం, అనేక పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు.

పారిశ్రామిక రంగంలో చిన్న కంపెనీలను తీసుకువచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం విషం వెదజల్లే కంపెనీలను ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కంపెనీల కోసం రైతుల భూములను గుంజుకుని బతుకుదెరువుకు దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడు ఏళ్లుగా వ్యవసాయ రంగం నష్టాలలో ఉందని, దీంతో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సిద్దిపేట జిల్లాలోనే రైతు ఆత్మహత్యలు అధికమని ఆయన అన్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులపైనే దృష్టి సారించి నిధులు ఖర్చు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు.

కొన్ని నెలలుగా సచివాలయానికి సీఎం రావడం లేదని సచివాలయానికి రాని సీఎంగా కేసీఆర్‌ గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధిస్తారేమో అని ఆయన ఎద్దేవా చేశారు. జయశంకర్‌సార్‌ చెప్పిన విధంగా తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం పోరాడామని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుతామని ఆయన చెప్పారు. తలకొండపల్లి సమీపంలో ఏర్పాటు చేయదలచిన డంపింగ్‌యార్డు ఏర్పాటును విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీజేఏసీ కో కన్వీనర్‌ పురుషోత్తం, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ చల్మారెడ్డి, జేఏసీ నాయకులు బాలాజీసింగ్, యాదిలాల్, పాపిశెట్టి రాము, రాజు, కుమార్, రాములు, శ్రీను, సంజీవ, గణేశ్, వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట కార్యక్రమం ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు