పోటాపోటీ | Sakshi
Sakshi News home page

పోటాపోటీ

Published Fri, Nov 10 2023 6:48 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసేందుకు గురువారం ఆయా రిటర్నింగ్‌ ఆఫీసులకు క్యూ కట్టారు. కొంతమంది ఆయా నియోజకవర్గాల్లోని ప్రముఖ దేవాలయాల్లో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీగా బయలు దేరారు. మరికొంత మంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, నేరుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఏకాదశి మంచి ముహూరం ఉండటంతో చాలావరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ సమయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు బల ప్రదర్శనకు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు వేసే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

‘పట్నం’లో ఉద్రిక్తం

నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీలో ఒకరిపై మరొకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన సుమారు యాభై మంది కార్యకర్తలు గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మొత్తం 19 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో బీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మూడు సెట్లు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, సీపీఎం పార్టీ అభ్యర్థి పగడాల యాదయ్య నామినేషన్లు సమర్పించారు.

మహేశ్వరంలో..

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ కర్మన్‌ఘట్‌ ఆంజనేయ స్వామి దేవయాలయంలో పూజలు నిర్వహించి, అనంతరం వేలాది మంది కార్యకర్తలతో బైక్‌ ర్యాలీగా బయలు దేరారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బాలాపూర్‌ లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అదే సమయంలో అటుగా ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. బీజేపీ ర్యాలీతో ఇటు మందమల్లమ్మ చౌరస్తా నుంచి బాలాపూర్‌, తుక్కుగూడ, మహేశ్వరం వరకు ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు మహేశ్వరం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకుని ఆయన తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మొత్తం 14 మంది 18 నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ అభ్యర్థి అందెల స్వయంగా వచ్చి రెండు సెట్లు దాఖలు చేయగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితారెడ్డి తరపున ఆమె మద్దతు దారులు రెండో సెట్‌ నామినేషన్‌ వేశారు.

ఎల్‌బీనగర్‌ నుంచి..

ఎల్‌బీనగర్‌ నియోజకర్గంలో మొత్తం 14 నామినేషన్‌లు దాఖలయ్యాయి.వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రె డ్డి స్వయంగా ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు రిటర్నింగ్‌ అధి కారికి అందజేశాడు. ఆయన తరుఫున మాజీ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి మరో సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ తాను ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, కాంగ్రెస్‌ పార్టి నాయకుడు మరోసెట్‌ నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఓకి అందజేశారు.

ఇతర నియోజకవర్గాల్లో ..

ప్రధానపార్టీల బలప్రదర్శన

నామినేషన్లు వేసిన అభ్యర్థులు

మద్దతుదారులు, కార్యకర్తలతో భారీ ర్యాలీలు

పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం

నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు

చేవెళ్ల నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు, 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య (రెండు సెట్లు), కాంగ్రెస్‌ అభ్యర్థి పామెన భీం భరత్‌, బీజేపీ అభ్యర్థి కొరని సాయన్న రత్నం, బీఎస్పీ అభ్యర్థి తొండుపల్లి రాజు (రాజామహేంద్రవర్మ) సహా ఇతర అభ్యర్థులు ఉన్నారు.

షాద్‌నగర్‌లో పది మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి అందె బాబయ్య, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి పి.ప్రశాంత్‌కుమార్‌ సహా మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో 9 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఆచారి తరపున ఆయన సతీమణి గీత సహా మరికొంత మంది నేతలు కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. బీఎస్పీ నుంచి శ్రీనివాసులు సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.

శేరిలింగంపల్లిలో ఏడుగురు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ ర్యాలీగా వచ్చి బీ ఫాంతో అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా ఒంగోరు శ్రీనివాస్‌ యాదవ్‌ సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ హనుమాన్‌ దేవాలయంలో ఉదయం నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీగా ఉప్పర్‌పల్లి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్‌ సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

Advertisement
Advertisement