ప్రచార కూలీలు | Sakshi
Sakshi News home page

ప్రచార కూలీలు

Published Fri, Nov 10 2023 6:48 AM

- - Sakshi

జోరందుకున్న ఎన్నికల ప్రచారం

ర్యాలీలు, సభలకు భారీగా జనసమీకరణ

అడిగినంత ఇస్తామంటేనే ర్యాలీల్లోకి కూలీలు

మద్యం, హోటళ్లు, పూలదండలకు భలే గిరాకీ

షాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా భారీ ర్యాలీలు.. మైకుల మోత.. కళాకారుల కోలాట నృత్యాల నడుమ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నాయకుల వెంట ఎల్లప్పుడూ పెద్దఎత్తున ప్రజలు ఉండేలా చూసుకుంటున్నారు. అభ్యర్థులు ఓట్ల కోసం చెమటోడుస్తుండగా మరోవైపు మద్యం, బిర్యానీ సెంటర్లు, పూలదండలు, బొకేల వ్యాపారం ఊపందుకుంది.

పూలదండలకు గిరాకీ...

కండువా మారుస్తున్నా, ప్రచారం కోసం ఊర్లోకి వచ్చే అభ్యర్థికి స్వాగతం పలకాలంటే పూలదండలు, శాలువాలు ముఖ్యం. దీంతో సాధారణ రోజుల కంటే ఎన్నికల సమయంలో దండల అమ్మకాలు పెరిగాయి. ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఇంటి నుంచి ప్రచారం మొదలు చేసిన సమయం నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు పూలదండలతో వారిని ముంచెత్తుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పూల దండలు తయారు చేసే వ్యాపారులకు చేతినిండా పని దొరికినట్లయ్యింది.

బీరు..బిర్యానీ

పార్టీల కోసం ప్రచారం చేసే నాయకులంతా పొద్దంతా కష్టపడి సాయంత్రం బీరు, బిర్యానీతో చిల్‌ అవుతున్నారు. ఎన్నికల ర్యాలీల పుణ్యమా అని జిల్లాలో మద్యం అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయి. శ్రేణులు చేజారిపోకుండా మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు అభ్యర్థులు. దీంతో వంటలు, కేటరింగ్‌ చేసేవారికి ఫుల్‌గా పని దొరుకుతుండగా.. బిర్యానీ సెంటర్లకు గిరాకీ పెరిగింది.

కళాకారుల ఆటాపాట..

ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉత్తేజ పర్చాలంటే కళాకారుల ఆటాపాట ఉండాల్సిందే. ప్రచార జోరులో కళాకారులు హోరెత్తిస్తున్నారు. కళాకారుల పాడే పాటలతో ప్రచారానికి ఊపొస్తుంది. కళాకారులతో పాటు కోలాటం, బతుకమ్మ ఆడే మహిళలకు ఉపాధి బాగా దొరుకుంతోంది.

సామాజిక మధ్యమాల ద్వారా..

ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రచారంలో కీలక భూమిక పోషిస్తున్న సామాజిక మాధ్యమాలను పూర్తిగా వినియోగించుకుంటున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ కాల్స్‌తో నిత్యం ఓటర్లకు చేరువవుతున్నారు. దీంతో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేసే చాలామందికి చేతినిండా పని లభిస్తోంది.

వాహనాలకు డిమాండ్‌...

ప్రచారం ఊపందుకోవడం, పార్టీల ముఖ్య నేతల ప్రచార సభల నేపథ్యంలో ట్యాక్సీలు, ట్రావెల్స్‌కు డిమాండ్‌ ఉంది. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుంటున్నారు. అలాగే నియోజకవర్గం, జిల్లా పరిధిలో నిర్వహించే సభలకు వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతున్నాయి.

బిజీగా కూలీలు...

ఎన్నికల పండగ రావడంతో రోజువారీ కూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. కూలిపని చేసి రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే కూలీకంటే ప్రచారంలో పాల్గొంటే వచ్చే డబ్బులు ఎక్కువగా ఉండటంతో వారు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థి ప్రచారానికి వెళ్లే సమయంలో తమ వెంట జనం కనిపించేలా ముందుగానే కూలీలను బుక్‌ చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement