భారత టీమ్‌లో అందరూ సామ్సన్‌లా?

16 Apr, 2019 13:32 IST|Sakshi

న్యూయార్క్‌ : వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ఓ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న రిషి కపూర్‌ కొన్ని నెలల క్రితం చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్‌కు సెలక్ట్‌ అయిన 15 మంది ఆటగాళ్ల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, ఎందుకు ఎక్కువమంది గడ్డంతో ఉన్నారు అంటూ కామెంట్‌ పెట్టారు. అందరూ సామ్సన్‌లా? అంటూ సెటైర్‌ వేశారు(ప్రాచీన ఇజ్రాలియన్‌ న్యాయాధిపతుల్లో సామ్సన్‌ ఒకరు. ఆయన బలమంతా అతని వెంట్రుకల్లోనే ఉండేదని ప్రతీతి). గడ్డంలేకుండా ఉంటే అందంగా, చురుగ్గా ఉంటారని, ఇది కేవలం తాను గమనించిన విషయం మాత్రమేనంటూ ట్వీట్‌ చేశారు.

అయితే రిషి కపూర్‌ ట్వీట్‌కు నెటిజన్లు అదే రీతిలో బదులిస్తున్నారు. మీ కుమారుడు కూడా గడ్డం పెంచుతూ కనబడుతుంటాడుగా అందుకే వీళ్లు కూడా పెంచి ఉంటారు. ముందుగా మీ కుమారుడు ఎందుకు గడ్డంపెంచుకుని తిరుగుతున్నాడో కనుక్కో అంటూ ఓ నెటిజన్‌ అంటే.. జట్టుకు జిల్లెట్‌ కంపెనీనీ స్పాన్సర్‌ చేయమంటే ఖచ్చితంగా వర్క్‌ అవుట్‌ అవుతుందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక మరో నెటిజన్‌ ఏకంగా 2011 వరల్డ్‌కప్ జట్టు సభ్యుల్లో చాలా మంది గడ్డం లేకుండా ఉన్నారంటూ అప్పటి ఫోటోను పోస్ట్‌ చేసి, బహుశా ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, గడ్డం పెంచుకుని ఉంటారు అంటూ కామెంట్‌ పెట్టాడు.

మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ  సోమవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు భారత్‌ తరపున  విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్, దినేశ్‌ కార్తీక్‌, చహల్, కుల్దీప్, భువనేశ్వర్‌, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీలు ఆడనున్నారు.

మరిన్ని వార్తలు