చిన్నారి అభిమానికి ఫోన్‌ చేసిన రాహుల్ గాంధీ

19 Apr, 2019 08:38 IST|Sakshi

తిరువనంతపురం :  అభిమాన సినీ తారలు, ఆటగాళ్ల కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూడటం సహజంగా చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకుల కోసం గంటల తరబడి ఎదురుచూసే ఫ్యాన్స్‌ కాస్తా అరుదుగానే ఉంటారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్‌ గాంధీ తొలిసారి దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వయనాడ్‌ నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ ప్రస్తుతం మూడు రోజుల పాటు కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో తన ప్రియతమ నాయకుడిని కలవడం కోసం ఓ పదేళ్ల బాలుడు దాదాపు 5 గంటల పాటు ఎదురు చూశాడు. కానీ భద్రతా కారణాల వల్ల కలవలేకపోయాడు. పాపం నిరాశతో వెనుదిరిగాడు. ఆ చిన్నారి బాధ చూడలేక అతని తండ్రి ఈ విషయాన్ని రాహుల్‌ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తన కుమారినికి రాహుల్‌ గాంధీ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు.

దానిలో ‘నా కుమారుని పేరు నందన్‌. తన వయసు 10 సంవత్సరాలు. తను రాహుల్‌ గాంధీకి చాలా పెద్ద అభిమాని. ఈ రోజు రాహుల్‌ వయనాడ్‌లో పర్యటిస్తున్నారని తెలిసి తనను కలిసేందుకు ఉదయం 5 గంటలకే సభా ప్రాంగణానికి వచ్చాడు. నందన్‌తో పాటు నేను కూడా ఉన్నాను. అంతేకాక రాహుల్‌ గాంధీ అంటే తనకు ఎంత అభిమానమో తెలిపేందుకు ఓ లేటర్‌లో ‘మోస్ట్‌ ఫేవరెట్‌ పర్సన్‌’ అని రాసుకుని మరీ తీసుకువచ్చాడు. తన చొక్కా జేబుకు రాహుల్‌ గాంధీ ఫోటోను కూడా పెట్టుకున్నాడు. నందన్‌.. తన అభిమాన నాయకున్ని కలవడం కోసం దాదాపు 5 గంటల సేపు నిరీక్షించాడు. కానీ భద్రతా కారణాల వల్ల రాహుల్‌ని కలిసే అవకాశం లభించలేదు. దాంతో నా కుమారుడు చాలా నిరాశకు గురయ్యాడు’ అని పేర్కొన్నాడు.

ఇలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే.. ఈ స్టోరి తెగ వైరలయ్యింది. స్థానిక మీడియా సాయంతో ఈ విషయం కాస్తా రాహుల్‌ గాంధీ దృష్టికి చేరింది. తన కోసం అన్ని గంటల పాటు ఎదురు చూసిన ఆ చిన్నారిని నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో రాహుల్‌.. నందన్‌ తండ్రికి కాల్‌ చేశారు. ‘హాయ్‌.. నేను రాహుల్‌ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా’ అని అడిగారు. అనంతరం తన చిన్నారి ఫ్యాన్‌తో కాసేపు మాట్లాడి.. అతన్ని సంతోషపెట్టారు. రాహుల్‌ గాంధీ నందన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకురాలు రమ్య ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రాహుల్‌ చేసిన పనిని తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు