సోషల్‌ మీడియాలో ‘నేను విన్నాను’

8 Apr, 2019 07:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. టీవీ చానళ్లు, వార్తా పత్రికలు రాజకీయ వార్తలతో హీటెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు స్వరం పెంచారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఏ పార్టీకీ చెందని వారు, ఏ వ్యక్తినీ పరిగణనలోకి తీసుకోని వారు, విశ్వసనీయత, విలువలు ఉన్న పార్టీకి పట్టం కట్టాలనుకునే తటస్థ ఓటరు సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నాడు.

వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి ప్రచార సాధానాలపై దృష్టి సారించారు. టీవీలు, పేపర్లపై తటస్థ ఓటరు అంత సుముఖంగా లేనట్టు తేటతెల్లమైంది. పైగా రాష్ట్రంలో ఒక వర్గం మీడియా మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాస్తవాలను ప్రతిబింబిస్తున్న వాట్సప్‌ క్లిప్పింగులు తదేకంగా వీక్షిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సోషల్‌ మీడియా వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తేలింది.

సగటున ఒక్కో వీక్షకుడు 45 నిమిషాల పాటు ఎక్కువగా వీక్షిస్తున్నట్టు పలు సర్వేలూ వెల్లడించాయి. గంటన్నరకు పైగా ఎక్కువ సమయం కేటాయిస్తున్న వారూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వాస్తవాల ద్వారానే ఓటు ఎవరికి వెయ్యాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎవరు అర్హులు వంటి అంశాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తటస్థ ఓటరును విపరీతంగా ప్రభావితం చేయగలిగే మాధ్యమంగా సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తటస్థ ఓటరు నిర్ణయంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఉంటాయి కాబట్టి వీరి నిర్ణయం కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నారు.

నాడు ఏమన్నారు.. నేడు ఏమంటున్నారు?
తొలుత: ‘హోదా ఏమైనా సంజీవనా? ఈశాన్య రాష్ట్రాల్లో పన్నెండేళ్ల నుంచి ఉంది అవేమైనా బాగుపడ్డాయా.. చూపించండి అవి ఎంతగా బాగుపడ్డాయో’
తర్వాత: ‘హోదా కోసం మా ఎంపీలు ఢిల్లీలో పోరాడారు.. ఏపీకి హోదా ఇవ్వకుండా మోదీ మోసం చేశారు’
తొలుత: ‘నేను చాలామంది ప్రధాన మంత్రులను చూశాను.. కానీ మోదీలాంటి సమర్థ ప్రధాని, మంచి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదు’
తర్వాత: ‘మోదీ అంత దుర్మార్గుడు ఎవరూ లేరు, క్రూరుడు, రాక్షసుడు, ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తారో రానీ చూస్తా’ ఇలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తటస్థ ఓటర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలను లక్షల సంఖ్యలో చూస్తున్నారు. ఇక కొత్తగా ఇస్తున్న హామీలను తటస్థ ఓటరు అసలే నమ్మడం లేదు.

పాత హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలు ఇస్తున్నారంటే ఇది ఎన్నికల స్టంట్‌ అని అభిప్రాయపడుతున్నారు. విలువలకు, విశ్వసనీయతకు తిలోదకాలిచ్చే వ్యక్తిగా, వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తిగా బాబును చూస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోనుప్రకటించాక కానీ తన మేనిఫెస్టోను ప్రకటించని చంద్రబాబు వైఎస్సార్‌సీపీ పథకాలను కాపీ కొట్టడంపైనా భారీగా సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

‘నేను విన్నాను.. నేనున్నాను’ కు విశేష ఆదరణ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార సభల్లో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అన్న వ్యాఖ్యలను ఎక్కువ మంది తటస్థులు వీక్షించినట్టు వెల్లడైంది. 3,600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని హామీలు ఇవ్వడంపై ఎక్కువ మంది తటస్థ నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. అలాగే ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఒకే మాటపై నిలబడిన వ్యక్తిగా వైఎస్‌ జగన్‌ను తటస్థులు ఎక్కువగా నమ్ముతున్నారు.

బాబుకు కొమ్ముకాసే మీడియాపై తీవ్ర వ్యతిరేకత
చంద్రబాబు మాటలు, హామీలు, రోజుకో మాటమార్చడంపైనే కాదు, ఆయనకు కొమ్ముకాసే మీడియాపైనా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి చెబుతున్న చంద్రబాబు ప్రసంగాలను పదే పదే గంటల తరబడి ప్రసారం చేయడాన్ని నెటిజన్లు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఆయా చానళ్లు తమ సొంత చానళ్లు, యూట్యూబ్‌లలో పెడుతుంటే వాటిని వీక్షించడం మానుకున్నారు.

చంద్రబాబు ప్రచారం అనంతరం ఆ ప్రసంగాన్ని ఆయా చానళ్లు యూట్యూబ్‌లలో పెడుతుంటే వాటిని చూసే వారే కరువయ్యారు. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా వాస్తవాలను తెలుసుకుని నిర్ణయాలు తీసుకునే వారి తీర్పు అత్యంత విలువైనదనే అంశాన్ని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు