వినేవాడుంటే సోషల్‌ మీడియా ఎన్నయినా..

19 Apr, 2019 09:19 IST|Sakshi

వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు. కొంచెం పద్ధతిగా చెప్పుకున్నాం కాబట్టి ఈ సామెత వినడానికి బాగుంది. కానీ ఇదే సామెతకు ఈ మధ్య చాలా రీమిక్స్ లు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన రీమేక్ సామెతను యాజ్ ఇటీజ్ గా సోషల్‌ మీడియాకు అపాదిస్తే... వినేవాడుంటే సోషల్‌ మీడియా ఎన్నయినా చెబుతోందనవచ్చు. అవును అసత్య వార్తలను ప్రచారం చేసి.. ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఆ మధ్య కేరళ వరదలప్పుడు ఆ హీరో, ఈ క్రికెట్‌ ఇంత సాయం చేశాడంటూ అందరిని తప్పుదోవ పట్టించింది. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ మూక దాడులకు కారణమైంది. ఇలా సోషల్‌ మీడియా ఫేక్‌ కథల గురించి చెప్తే ఒడిసేది కాదు.. దంచితే దంగేది కాదు.తాజాగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో మరో అసత్యవార్త హల్‌చల్‌ చేస్తోంది.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన రెండో దశ పోలింగ్‌లో సినీతారాలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ఇంకుడ్‌ వేలును చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నాడని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షికారు చేస్తుంది. పైగా సుందర్‌ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్‌కు జత చేసి ఫొటోను ఫ్యాక్ట్‌ చెక్‌ చేయగా అసలు విషయం బయటపడింది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం అంత ఉత్తదేనని తేలిపోయింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సుంధర్‌ ఫొటో.. 2017 ఐఐటీ కరగ్‌పూర్‌ను సందర్శించిననాటిదని తేలిపోయంది. ఆ సమయంలో సుంధర్‌ ఈ ఫొటో తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోనే వాడుకుంటూ సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నాడని అసత్యప్రచారాని తెరలేపారు.  సుందర్‌ తమిళనాడులోని మధురైలో జన్మించినప్పటికి.. అతను అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. అతను భారత్‌లో ఓటేస్తానన్నా.. ఈసీ అనుమతించదు. భారత పౌరసత్వం కలిగి ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు మాత్రం ఓటేసే అవకాశం కల్పిస్తారు.

మరిన్ని వార్తలు