ముగ్గురు బాల కార్మికులకు విముక్తి | Sakshi
Sakshi News home page

ముగ్గురు బాల కార్మికులకు విముక్తి

Published Fri, Apr 19 2019 9:32 AM

Three Child Labour Free From Home Owners - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో ముగ్గురు బాల కార్మికులకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు విముక్తి కలిగించారు. ఓ వ్యక్తి ప్రధాన మంత్రికి రాసిన లేఖతో కదిలిన యంత్రాంగం ఈ ముగ్గురిని బయటకు తీసుకురాగలిగారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇంతియాజ్, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.46లోని ఫ్లాట్‌ నంబర్‌ 905లో నివసిస్తున్న వ్యాపారి బల్వీదర్‌ సింగ్‌ ఇంట్లో ముగ్గురు బాల కార్మికులు ఏడాది కాలంగా పనిచేస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్మికశాఖ, బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఇక్కడి యంత్రాంగం కదిలింది. ఈ లిఖిత పూర్వక సమాచారం అందుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డి, కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సంయుక్తంగా గురువారం ఉదయం ఈ ఇంటిపై దాడి చేశారు.

అధికారులు, పోలీసులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా ఇంటి యజమానులు అడ్డుకుని ముగ్గురు పిల్లలను దాచేందుకు యత్నించారు. గోడపై నుంచి బయటకు దాటించేందుకు కూడా యత్నించినా చుట్టూ పోలీసులు ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదని ఇంటి యజమానురాలు బయటకు రావడంతో అధికారులు తాము వచ్చిన విషయాన్ని తెలిపారు. ఒక్కో శాఖ నుంచి ఒక్కరు రావాలంటూ ఆమె ఆంక్షలు విధించింది. మీడియాను లోనికి రాకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. లోనికి వెళ్లిన అధికారులు ముగ్గురు బాల కార్మికులను గుర్తించి వారి గుర్తింపు పత్రాలను అడగ్గా వాటిని ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురు మైనర్‌ బాలికలను విచారించగా.. ఢిల్లీలోని ఓ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నట్లు తేలింది. ఓ బాలిక ఏడాదిగాను, మరో ఇద్దరు బాలికలు గత ఫిబ్రవరి నుంచి పనిచేస్తున్నారని, ఈ ముగ్గురూ జార్ఖండ్‌కు చెందిన వారని తెలిపారు. బాలికలను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ ముందు హాజరు పరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని ఇంతియాజ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం వరకు ఈ ఇల్లు ఏపీ మంత్రి నారాయణది కాగా ఇటీవలనే ఆయన ఇంటిని అమ్మేయగా దాన్ని బల్వీందర్‌సింగ్‌ కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement