మరో మలింగా దొరికాడోచ్‌

27 Sep, 2019 13:27 IST|Sakshi

కొలంబో:  లసిత్‌ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యార్కర్లను సంధించడంలో సిద్ధహస్తుడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌ టైమ్‌ దిగ్గజాల్లో మలింగా ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2006 నుంచి 2013 వరకూ మలింగా శకం నడిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ కాలంలో మలింగా 267 వికెట్లు సాధించి ఎవ్వరికీ  అందనంత ఎత్తులో నిలిచాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌ మలింగా. తన వన్డే కెరీర్‌లో 338 వికెట్లు సాధించాడు.

ఇటీవల వన్డేలకు గుడ్‌ బై చెప్పిన మలింగా.. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించి తనలోని పవర్‌ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. అయితే ఇప్పుడు మరో మలింగా దొరికాడు.  ఆ యువ క్రికెటర్‌ కూడా శ్రీలంకకు చెందిన వాడే. మలింగాలు శ్రీలంకలోనే పుడతారా అనేంతగా తన బౌలింగ్‌లోని పంచ్‌ను విసురుతున్నాడు.

17 ఏళ్ల మతీషా పతిరాణా ప్రస్తుతం కాలేజ్‌ మ్యాచ్‌ల్లో ఇరగదీస్తున్నాడు. మలింగాను స్పూర్తిగా తీసుకున్న పతిరాణా.. అదే శైలిని అవలంభిస్తూ యార్కర్లతో రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఓ కాలేజ్‌ గేమ్‌లో ఆడిన పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా వేస్తూ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టిస్తున్నాడు. అచ్చం మలింగానే గుర్తు చేస్తుండటంతో జాతీయ జట్టులోకి రావడం అంతగా కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం పతిరాణాకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా