బౌలర్ గా మారి అతుక్కుపోయాడు!

24 Oct, 2016 13:38 IST|Sakshi
బౌలర్ గా మారి అతుక్కుపోయాడు!

మొహాలీ:ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపెట్టడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమకు ఇచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. మరోవైపు మరో్ యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ఆశిస్తున్న పలువురు వెటరన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు.  ఇప్పుడు మహారాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్ మరోసారి ఊహించని విధంగా జట్టులోకి వచ్చి అతుక్కుపోయాడు.  

2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన కేదర్ జాదవ్కు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. తన అరంగేట్రం తరువాత ఇప్పటివరకూ 10 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కేదర్ జాదవ్.. తొలుత వికెట్ కీపర్ బ్యాట్స్మన్.  దానిలో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కూడా. అయితే మారుతున్న పరిస్థుతుల దృష్ట్యా న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆఫ్ బ్రేక్ బౌలర్గా మారాడు.

ఇప్పుడు అదే ఆ క్రికెటర్ కు వరంలా మారింది. ఈ వన్డే సిరీస్లో అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్న జాదవ్.. అటు బ్యాట్స్తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకూ జరిగిన మూడు వన్డేల్లో జాదవ్ ఆరు వికెట్లు సాధించాడు.  తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన ఈ క్రికెటర్.. రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా, కీలకమైన మూడో వన్డేలో మూడు వికెట్లు తీసి కివీస్ టాపార్డర్కు షాకిచ్చాడు. న్యూజిలాండ్ 12.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న స్థితిలో కెప్టెన్ విలియమ్సన్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపడంతో వికెట్ల వేటను ఆరంభించిన కేదర్.. ఆ తరువాత రాస్ టేలర్, టామ్ లాధమ్లను అవుట్ అవుట్ చేసి అతనిలో బౌలింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.

అయితే ఈ వికెట్లను తీసే క్రమంలో అతను వేసిన ఓవర్లు 10 మాత్రమే కావడం విశేషం. కేవలం మూడు వన్డేల్లో 60 బంతులు మాత్రమే వేసిన కేదర్.. 10.0 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. మరోవైపు తొలి వన్డేలో 10 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కేదర్.. రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. దాంతో తాను కూడా ఆల్ రౌండర్ గా సరిపోతాననే సంకేతాల్ని పంపాడు ఈ 31 ఏళ్ల క్రికెటర్.

మరిన్ని వార్తలు