రిటైర్మెంట్‌.. రాయుడు భావోద్వేగం

3 Jul, 2019 20:03 IST|Sakshi

ముంబై: ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలోనే రిటైర్మెంట్‌ ప్రకటించి అంబటి తిరుపతి రాయుడు అందరనీ షాక్‌కు గురిచేశాడు. ఐపీఎల్‌తో సహా అన్ని ఫార్మట్ల క్రికెట్‌ నుంచి తాను రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటిస్తూ బీసీసీఐకి లేఖ రాశాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు వద్ద రాయుడు భావోద్వేగానికి లోనయినట్లు తెలిసింది. టీమిండియా తరుపున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి, కెప్టెన్లకి కృతజ్ఞతలు అంటూ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ముఖ్యంగా సారథి విరాట్‌ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. (చదవండి: ఆటకు రాయుడు గుడ్‌బై)
‘25 ఏళ్లుగా అన్ని లెవల్స్‌ క్రికెట్‌ ఆడాను. దేశం తరుపున ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవం. ఆ అవకాశం నాకు కల్పించిన బీసీసీఐకి, సారథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల సారథ్యాలలో ఆడిన అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా కోహ్లి నాపై పెట్టుకున్న గొప్ప నమ్మకానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కష్టకాలంలో అనేకమార్లు నాకు అండగా నిలిచాడు. అవకాశాలు ఇచ్చి నన్ను ప్రొత్సహించాడు. ఐపీఎల్‌లో నాకు అండగా నిలిచి మద్దతు తెలిపిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ స్థాయికి రావడానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు’అంటూ రాయుడు పేర్కొన్నాడు.   

ఇక రాయుడు రిటైర్మెంట్‌పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొందరపడ్డాడని కొందరంటే.. ఇంకా అవమానాలు భరించే ఓపికలేకే వీడ్కోలు పలికాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో చోటు దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, సెలక్టర్లు మాత్రం ‘త్రీడీ’ అంటూ విజయ్‌ శంకర్‌వైపు మొగ్గు చూపారు. దాంతో, 'త్రీడీ కళ్ళద్దాల కోసం ఆర్డర్‌ చేశాను..' అంటూ సోషల్‌ మీడియాలో అంబటి రాయుడి సెటైర్‌ వేయాల్సి వచ్చింది. ఆ సెటైరే ఈ తెలుగు క్రికెటర్‌ అవకాశాల్ని దెబ్బతీసిందని వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్‌, విజయ్ శంకర్‌లిద్దరూ గాయాల బారిన పడినా రాయుడుకు బీసీసీఐ నుంచి పిలుపు రాలేదు. వీరిద్దరి స్థానాల్లో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌లకు సెలక్టర్లు చోటు కల్పించడంతో రాయుడు తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు.

చదవండి: 
రాయుడి రిటైర్‌మెంట్‌; గంభీర్‌ ఫైర్‌
రాయుడును వీడని ‘3డి’

మరిన్ని వార్తలు