‘అందుకే యువీకి నాపై కోపం’

13 Nov, 2018 12:54 IST|Sakshi
అంగద్‌ బేడీ- నేహా ధుపియా(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: తన పెళ్లి గురించి చెప్పనందుకు క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తనపై కోపంగా ఉన్నాడని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అంగద్‌ బేడీ. ఈ ఏడాది సినీ నటి నేహా ధుపియాను అంగద్‌ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేవరకు వీరి పెళ్లి విషయం బయటకు రానివ్వలేదు. అయితే యువరాజ్‌, అంగద్‌ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాంటిది పెళ్లి గురించి కనీసం తనకు కూడా ఒక్కమాటైనా చెప్పలేని కారణంగా యువీ చాలా అప్‌సెట్‌ అయ్యాడని అంగద్‌ పేర్కొన్నారు. అందుకే తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అంగద్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘ఫ్రెండ్‌షిప్‌ డే రోజున యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘నా స్నేహితులనుకున్నవారితో నాకు ఎదురైన అనుభవాలను చూశాక మనుషుల కంటే నా శునకాలే మేలనిపించింది’ అని పోస్ట్‌ చేశాడు. అది చూశాక నా గురించే ఆ పోస్ట్‌ పెట్టాడనిపించింది. తప్పు నాదే. నా ప్రాణ స్నేహితుడైన యువీకి నా పెళ్లి గురించి చెప్పలేదు. కానీ అనుకోకుండా పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యువీ నాపై కోపంగా ఉండటానికి అతనికి చాలా కారణాలు ఉండవచ్చు. నాకు యువీ అంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇదివరకు ఉన్నట్లుగా లేదు. త్వరలో అతనికి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నాను’ అని అంగద్‌ బేడీ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు