పసిడి పంట 

10 Oct, 2018 01:28 IST|Sakshi

ఆసియా పారా క్రీడల్లో మూడో రోజు భారత్‌కు మూడు స్వర్ణాలు   

జకార్తా: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు మంగళవారం భారత్‌ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు చేరాయి. షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల పి–1 ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనీశ్‌ నర్వాల్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మనీశ్‌ 235.9 పాయింట్లు స్కోరు చేశాడు. అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్‌ మహిళల క్లబ్‌ త్రో (ఎఫ్‌ 32/51) విభాగంలో, పురుషుల 100 మీటర్ల (టి35) విభాగంలో నారాయణ్‌ ఠాకూర్‌ బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఏక్తా ఇనుప గుండును 16.02 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. నారాయణ్‌ ఠాకూర్‌ 14.02 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు.

పురుషుల షాట్‌పుట్‌ (ఎఫ్‌ 56/57)లో వీరేందర్, పురుషుల హైజంప్‌ (టి 45/46/47)లో రాంపాల్, డిస్కస్‌ త్రో (ఎఫ్‌ 43/44/62/64)లో సురేంద్రన్‌ పిళ్లై, అనీశ్‌ కుమార్‌ రజత పతకాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్‌ (ఎఫ్‌ 11)లో మోనూ ఘంగాస్, 200 మీటర్ల (టి 44/62/64)లో ఆనందన్‌ గుణశేఖరన్, డిస్కస్‌ త్రో (ఎఫ్‌ 46)లో గుర్జర్‌ సుందర్‌ సింగ్, డిస్కస్‌ త్రో (ఎఫ్‌ 43/44/62/64)లో ప్రదీప్, మహిళల 200 మీటర్ల పరుగు (టి 45/46/47)లో జయంతి బెహరా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 28 పతకాలతో తొమ్మిదో స్థానంలోఉంది.    

మరిన్ని వార్తలు