డైనమిక్‌ అయ్యర్‌

26 Sep, 2023 04:09 IST|Sakshi

న్యూస్‌ మేకర్‌

సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్‌ రెండో కోవకు చెందిన వ్యక్తి.

‘సీఏ పరీక్ష పాస్‌ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్‌వో (చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది....

లీడర్‌ అంటే ఎవరు?
దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్‌ ఐటీ కార్పోరేషన్‌ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో  పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం.
సీనియర్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్‌ టీమ్‌తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్‌వో స్థాయికి చేరింది.

ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, క్యాపిటల్‌ అలోకేషన్, ఫండ్‌ రైజింగ్, బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ గ్రోత్‌... మొదలైన సబ్జెక్‌లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్‌.
ఇంటర్నల్‌ ఆడిట్, బిజినెస్‌ ఫైనాన్స్, ఫైనాల్సియల్‌ ప్లానింగ్‌ అండ్‌ ఎనాలటిక్స్, కార్పోరేట్‌ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది.

ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్‌ ఎకౌంటెంట్‌) గోల్డ్‌ మెడలిస్ట్‌. ‘అపర్ణ అయ్యర్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్‌. ‘కీలకమైన సమయంలో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్‌.

మరిన్ని వార్తలు