క్రికెట్‌ చరిత్రలో తొలి జట్టుగా ఆసీస్‌

12 Jan, 2019 17:03 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని నమోదు చేసిన ఆసీస్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. భారత్‌తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ గెలువడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా క్రికెట్‌ చరిత్రలో ఈ మార్కును చేరిన తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది. టెస్టుల్లో 384 విజయాలు సాధించిన ఆసీస్‌.. వన్డేల్లో 558,  టీ20ల్లో 58 విజయాలు అందుకుంది.

1877లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా తొలి విజయాన్ని సాధించిన ఆసీస్‌ తన విజయ ప్రస్థానంలో ఎవ‍్వరికీ అందనంత దూరంలో నిలిచింది. తన 100వ అంతర్జాతీయ విజయాన్ని 1951లో వెస్టిండీస్‌పై సాధించగా, 200వ విజయాన్ని 1981లో భారత్‌పై సాధించింది. ఇక 300, 400 విజయాలను ఇంగ్లండ్‌పైనే ఆసీస్‌ నమోదు చేసింది. 1989లో 300వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆసీస్‌.. 1994లో 400 విజయాన్ని సాధించింది. 500వ విజయాన్నిపాకిస్తాన్‌పై(1999లో), 600వ విజయాన్ని వెస్టిండీస్‌పై(2003), 700వ విజయాన్ని భారత్‌పై(2006లో), 800వ విజయాన్ని పాకిస్తాన్‌పై(2010లో), 900వ విజయాన్ని ఇంగ్లండ్‌(2014)పై సాధించింది. అంతర్జాతీ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ విజయాలు సాధించిన జట్లలో  ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ ఇప‍్పటివరకూ 774 విజయాలు సాధించింది. ఇక భారత్‌ 711 విజయాలతో మూడో స్థానంలో ఉంది. వన్డే విజయాల పరంగా చూస్తే భారత్‌ రెండో స్థానంలో ఉంది. వన్డే ఫార్మాట్‌లో భారత్‌ సాధించిన విజయాల సంఖ్య 492.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు