బౌలింగ్‌ చేస్తే ఊపిరితిత్తుల్లోకి రక్తం

14 Nov, 2018 01:56 IST|Sakshi

ఆసీస్‌ పేసర్‌ హేస్టింగ్స్‌ రిటైర్మెంట్‌

మెల్‌బోర్న్‌: వైద్యులకు అంతు చిక్కని అరుదైన వ్యాధితో ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. హేస్టింగ్స్‌ బౌలింగ్‌ చేసినప్పుడల్లా ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోంది. దాదాపు నెల రోజుల క్రితం అతనికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రన్నింగ్, రోయింగ్, ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌వంటి ఎన్నో ఎక్సర్‌సైజ్‌లు చేసినా ఇబ్బంది రాకపోగా, బౌలింగ్‌ చేసినప్పుడు మాత్రమే సమస్య కనిపించడం అరుదైన వ్యాధిగా మారింది.
 

వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దీనిపై స్పష్టత రాలేదు. ఇకపై కూడా రక్తస్రావం జరగదని తాము హామీ ఇవ్వలేమని వైద్యులు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఆటకు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించాలని 33 ఏళ్ల హేస్టింగ్స్‌ నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టి20లు ఆడిన హేస్టింగ్స్‌... ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్‌ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.     

మరిన్ని వార్తలు