అజామ్‌ 97.. స్టార్క్‌ విజృంభణ

1 Dec, 2019 10:50 IST|Sakshi

అడిలైడ్‌:  పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ విజృంభించాడు. పాకిస్తాన​ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేసి ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. 96/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌కు బాబర్‌ అజామ్‌ ఆదుకునే యత్నం చేశాడు. యాసిర్‌ షాతో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే యాసిర్‌ షా హాఫ్‌ సెంచరీ సాధించాడు.

కాగా, అజామ్‌ ఏడో వికెట్‌గా ఔటై తృటిలో సెంచరీ కోల్పోయాడు. అజామ్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్‌ ఔటయ్యాడు. అనంతరం షాహిన్‌ ఆఫ్రిది గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.దాంతో స్టార్క్‌ ఖాతాలో ఆరో వికెట్‌ చేరగా, పాకిస్తాన్‌ 194 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. పాకిస్తాన్‌కు ఫాలో ఆన్‌ ప్రమాదం తప్పేట్టు కనబడుటం లేదు. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే ఇంకా 190కు పైగా పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. రెండో రోజు ఆటలో స్టార్క్‌ నాలుగు వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా  3 వికెట్లకు 589 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  డేవిడ్‌ వార్నర్‌ (418 బంతుల్లో 335 నాటౌట్‌; 39 ఫోర్లు, సిక్స్‌) ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.



 

>
మరిన్ని వార్తలు