యుద్ధంలో పాక్ సాయం కోరిన హమాస్

7 Dec, 2023 10:42 IST|Sakshi

గాజా:ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో పాకిస్థాన్ సహాయాన్ని హమాస్ సీనియర్ నాయకుడు  ఇస్మాయిల్ హనియే కోరినట్లు సమాచారం. పాకిస్థాన్‌ను చాలా ధైర్యవంతమైన దేశంగా కొనియాడిన ఆయన.. ఇజ్రాయెల్ దారుణాన్ని ఆపగల శక్తి పాక్‌కు ఉందని అన్నారు. యుద్ధంలో హమాస్‌కు పాకిస్థాన్ సహాయం అందిస్తుందని ఆశించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.

గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఇస్లాం దేశాలు వ్యతిరేకించాల్సిన  ఆవశ్యకతను హనియే గుర్తు చేశారు. దాదాపు 16,000 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేయడం, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంతో సహా ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్న అమెరికా సహా ఇతర దేశాలపై ఆయన నిప్పులు చెరిగారు. 

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరగబడిన ఇజ్రాయెల్.. హమాస్‌పై ఉక్కుపాదం మోపింది. రాకెట్ దాడులతో విరుచుకుపడింది. అనంతరం భూతర దాడులను నిర్వహించింది. ఉత్తర గాజాను ఇప్పటికే ఆక్రమించింది. సొరంగాల్లో నక్కిన హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టడానికి హమాస్‌ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.    

ఇదీ చదవండి: గాజాలో భయం భయం

>
మరిన్ని వార్తలు