కోహ్లి ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే

11 Dec, 2017 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ : తీరిక లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌( ఎఫ్‌టీపీ) మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గించారు.

2019 నుంచి 2023 మధ్య 390 రోజులు ఆడాల్సి ఉండగా ఈ సంఖ్యను 306 రోజులకు తగ్గించారు. ఈ ప్రణాళికలో 2021 చాంపియన్స్‌ ట్రోఫీ, 2023 ప్రపంచకప్‌ మ్యాచ్‌లను లెక్కించలేదు. ఈ టోర్నీల్లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను కలిపినా ఈ సంఖ్య 350కు మించదు. అయితే  ప్రస్తుత ఎఫ్‌టీపీతో పోలిస్తే 2019-2023 ఎఫ్‌టీపీ ప్రకారం టీమిండియా మూడు రెట్లు ఎక్కువగా టీ20లు ఆడనుందని సమాచారం.

ఈ మధ్యకాలంలో భారత్‌ 50 శాతం మ్యాచ్‌లను పెద్ద జట్లైన ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడింది. ఈ అన్ని జట్లతో  లాంగ్‌ ఫార్మట్‌ సిరీస్‌లు ఎక్కువగా ఆడింది. దీంతో ఎక్కువ రోజులు ఆడాల్సి రావడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వచ్చే ఎఫ్‌టీపీలో టెస్టు, వన్డేలను తగ్గిస్తే మ్యాచ్‌లు ఆడే రోజులు తగ్గుతాయని, అలాగే మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ ప్రత్యామ్నాయంగా టీ20ల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు