‘ఆ కాంట్రాక్ట్‌ మొత్తాన్ని బీసీసీఐ ఇస్తామంది’

17 Nov, 2018 14:20 IST|Sakshi

ఆంటిగ్వా: దాదాపు నాలుగేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సిరీస్‌ను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. భారత్‌తో నాలుగు వన్డేల జరిగిన తర్వాత ఐదో వన్డే ఆడే క్రమంలో ఆ జట్టు పర్యటనకు స్వస్తి పలికింది. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డుతో ఆ దేశ క్రికెటర్లకు కాంట్రాక్ట్‌ విషయంలో విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన సజావువుగా సాగలేదు. అయితే ఆనాడు చోటు చేసుకున్న పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్నాడు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆ దేశ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రేవో. ఆ సమయంలో తమ క్రికెట్‌ బోర్డుతో నెలకొన్న విభేదాల కారణంగా తాము పెద్ద మొత్తంలో నగదును కోల్పోయి పరిస్థితే వస్తే, అందుకు బీసీసీఐ నుంచి ఊహించని మద్దతు లభించిందన్నాడు.

‘మేము భారత్ పర్యటనకు వచ్చేటప్పటికే మా బోర్డుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసలు ఐదు వన్డేల సిరీస్‌ జరుగుతుందా అనేది కూడా అనుమానమే. మా ఆటగాళ్లు ఎవరూ మ్యాచ్‌లు ఆడటానికి సుముఖంగా లేరు. ఈ విషయం అప్పటి బీసీసీఐ చీఫ్‌ ఎన్‌ శ్రీనివాసన్‌ వరకూ వెళ్లింది. ఆ క్రమంలోనే నన‍్ను పిలిచి మాట్లాడారు. మేము కోల్పోయే మొత్తాన్ని ఇచ్చేందుకు ఆఫర్‌ చేశారు. ఇదే విషయాన్ని టీమ్‌ సభ్యులకు చెప్పాను. మనం కచ్చితంగా సిరీస్‌ ఆడాలనే వారికి స్పష్టం చేశా. ఒక్క ఆటగాడు మినహా అంతా ఆడటానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆటగాళ్ల బెదిరింపుల మధ్య నాలుగు వన్డేలు జరిగాయి. అయితే ఐదో వన్డే నాటికి సమస్య తీవ్రత ఎక్కువ కావడంతో ఆ మ్యాచ్‌ జరగలేదు’ అని బ్రేవో తెలిపాడు.

అప్పుడు తమకు బీసీసీఐ నుంచి లభించిన మద్దతు ఊహించలేనిదన్నాడు. ఇలా వేరే క్రికెట్‌ బోర్డు తాము కోల్పోయే కాంట్రాక్ట్‌ మొత్తాన్ని ఇస్తామనడం నిజంగానే గొప్ప విషయమన్నాడు. కాకపోతే మరొక బోర్డు నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని తాము కోరుకోలేదని, తమ బోర్డుతో ఉన్న సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం మాత్రమే ఉందని బ్రేవో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు