‘అసలైన అర్బన్‌ నక్సల్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌’

17 Nov, 2018 13:50 IST|Sakshi

బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారి వ్యాఖ్యలు

రాయ్‌పూర్‌ : అర్బన్‌ నక్సల్స్‌కి అసలైన ఉదాహరణ ఆమ్‌ ఆద్మీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అని బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారి వ్యాఖ్యానించారు. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తామని ఆయన విమర్శించారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా తివారి శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దేశ గణతంత్ర దినోత్సవం రోజున ధర్నా నిర్వహించిన ఘనత కేజ్రీవాల్‌కే దక్కుతుందని, ఆయన విధానాలు నక్సల్స్‌ మాదిరిగానే ఉంటాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దేశంలో నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి అర్బన్‌ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారని, సంఘ విద్రోహులను వారు విప్లవకారులుగా కీర్తిస్తారని విమర్శించారు. కశ్మీర్‌ సరిహద్దుల్లో భారత సైనికులపై తూటలతో దాడులు చేస్తున్న పాకిస్తాన్‌ ఆర్మీ అధికారిని కాంగ్రెస్‌ మంత్రి సిద్దూ ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని 72 స్థానాలు రెండో దశ ఎన్నికలు ఈనెల 20న జరగునున్న విషయం తెలిసిందే.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు