ఐపీఎల్‌లో పవర్‌ ప్లేయర్‌ రూల్‌!

4 Nov, 2019 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ:  క్రికెట్‌ను సరికొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఇప్పటికే అనేక ప్రయోగాలు చేయగా, తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి నాంది పలకడానికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సన్నద్ధమైంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో పవర్‌ ప్లేయర్‌ అనే ప్రయోగాన్ని సిద్ధం చేసేందుకు కసరత్తులు చేస్తోంది.  ఒక ఆటగాడ్ని జట్టు అవసరాల్ని బట్టి ఏ దశలోనైనా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే సమయంలో తుది జట్టును ప్రకటించే ముందు 11 మందికి బదులు 15మందికి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది. అంటే తుది జట్టులో ఆడేది 11 మందే అయినా, మిగతా నలుగుర్ని సబ్‌స్టిట్యూట్‌లగా ఉపయోగించుకోవచ్చు.

దాంతో ఒక ఆటగాడి స్థానంలో మరొక ఆటగాడ్ని దింపడానికి వెసులుబాటు కుదురుతుందనేది బీసీసీఐ భావన. దీనిపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ వచ్చే ఐపీఎల్‌లో తుది జట్టును 11 మందితో కాకుండా 15 మందితో కూడిన జట్టును సిద్ధం చేసుకునే దానిపై కసరత్తులు చేస్తున్నాం. ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే 15 మందితో జట్టును ప్రకటించుకోవచ్చు. ఒక ప్లేయర్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగొచ్చు. వికెట్‌ పడిన సమయమా, చివరి ఓవరా అనేది కాకుండా ఏ సమయంలోనే అతడ్ని జట్టు అవసరాలకు తగ్గుట్టు  వినియోగించుకోవచ్చు. ఇది వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్‌ నాటికి సిద్ధం చేయడానికి చూస్తున్నాం.

దీన్ని తొలుత దేశవాళీ లీగ్‌ అయిన ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలనుకుంటున్నాం’ అని సదరు అధికారి తెలిపారు.  ఈ విధానం వల్ల  మ్యాచ్‌ స్వరూపం మారిపోయి అభిమానుల్లో మరింత ఆసక్తిని నింపుతుందనేది బీసీసీఐ భావనగా ఉంది. ఉదాహరణకు చివరి ఓవర్‌లో ఛేజింగ్‌ చేసే జట్టుకు 20 పరుగులు అవసరమైన సమయంలో 11 మంది ఆటగాళ్ల జాబితాలోని మరొక ఆటగాడ్ని (హార్డ్‌ హిట్టర్‌) పంపుకునే వీలుంటుంది. ఆ ఓవర్‌లో టెయిలెండర్‌ స్థానంలో ఆండ్రీ రసెల్‌ వంటి హార్డ్‌ హిట్టర్‌ను నేరుగా పంపవచ్చన్నమాట. దీనిపై మంగళవారం బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో జరుగనున్న సమావేశంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా