నీ భర్త ద్రోహి.. ఆ క్రికెటర్‌ భార్యపై ఆగ్రహం!

26 Mar, 2018 18:01 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సతీమణి క్యాండైస్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆమె.. అక్కడ తాము సందర్శించిన ప్రదేశాలకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్‌ చేసుకుంది. రోజుకు రెండు పోస్టులైనా ఆమెవి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేవి. తాను దిగిన ఫొటోలు, భర్తతో, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు ఆమె షేర్‌ చేసుకునేది. దక్షిణాఫ్రికా అందాలను పర్యటనను ఆస్వాదిస్తూ.. ఆమె పెట్టే ఫొటోలకు అభిమానులు, ఫాలోవర్స్‌ నుంచి మంచి మద్దతు లభించేది. కానీ, బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం వెలుగుచూడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్‌ బెన్‌క్రాప్ట్‌ బాల్‌ను ట్యాంపరింగ్‌ చేసేందుకు ప్రయత్నించడం, ఇది సమిష్టి తప్పిదమని ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ ప్రకటించడంతో క్రికెట్‌ ప్రపంచంలో పెనుదుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో డేవిడ్‌ వార్నర్‌ వైస్‌ కెప్టెన్సీ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ భార్య క్యాండైస్‌ పైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తను అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నీ భర్త ఒక ద్రోహి.. అతన్ని చూసి సిగ్గుపడుతున్నాం’  అని నెటిజన్‌ ఆమె ఫొటోపై కామెంట్‌ చేయగా.. ‘నీ భర్త నీ దేశాన్ని అప్రతిష్టపాలు చేశారు. ద్రోహి’ అంటూ మరో నెటిజన్‌ విరుచుకుపడ్డారు. ‘మీ నాన్న ద్రోహి అని నువ్వెప్పుడు తెలుసుకుంటావు’ అని ఇంకో నెటిజన్‌.. డేవిడ్‌ వార్నర్‌ పిల్లల ఫొటోపై విద్వేషం వెళ్లగక్కాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ పరిణామం వెలుగుచూడటంతో క్యాండైస్‌ సోషల్‌ మీడియాకు దూరం జరిగినట్టు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా ఆమె ఏమీ పోస్టు చేయడం లేదు.

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ పర్యటనలో భాగంగా అక్కడి పర్యాటక ప్రాంతాల్లో, బీచుల్లో విహరిస్తున్న ఫొటోలు డేవిడ్‌ వార్నర్‌తోపాటు ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టీవ్‌ స్మీత్‌, అతని ఫియాన్సీ డానీ విల్లిస్‌ ఇప్పటివరకు పోస్టు చేస్తూ వచ్చారు. బ్యాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం తర్వాత క్యాండైసే కాదు.. డానీ విల్లిస్‌  కూడా సోషల్‌ మీడియాలో ఏమీ పోస్టు చేయలేదు. బ్యాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్‌ స్మిత్‌ సోమవారం ఆస్ట్రేలియాకు తిరుగుముఖం పట్టనున్నారు. డేవిడ్‌ వార్నర్‌ మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

మరిన్ని వార్తలు