క్రికెట్‌ ‘సమాచారం’ చెప్పాల్సిందే!

2 Oct, 2018 00:36 IST|Sakshi

ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ 

15 రోజుల్లోగా ఏర్పాట్లు చేసుకోండి 

కేంద్ర సమాచార కమిషన్‌ ఉత్తర్వులు  

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ పరిపాలనకు సంబంధిం చిన కీలక పరిణామం... ఇప్పటి వరకు సగటు క్రికెట్‌ అభిమాని దేని గురించి అడిగినా ‘చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ దాటవేస్తూ వచ్చిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పవర్‌కు బ్రేక్‌... బీసీసీఐని కూడా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం కోరితే బీసీసీఐ తప్పనిసరిగా దానిని వెల్లడించాల్సి ఉంటుంది. వివిధ చట్టాలు, సుప్రీం కోర్టు ఉత్తర్వులు, లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక, జాతీయ క్రీడా మంత్రిత్వశాఖ నిబంధనలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 2 (హెచ్‌) పరిధిలోకి బీసీసీఐ వస్తుందంటూ సీఐసీ తేల్చింది. ‘దేశంలో క్రికెట్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు సర్వహక్కులు ఉన్న బీసీసీఐ ప్రభుత్వ ఆమోదం పొందిన జాతీయ స్థాయి సంస్థ అంటూ సుప్రీం కోర్టు కూడా గతంలోనే స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం పరిధిలో జాతీయ క్రీడా సమాఖ్య జాబితాలో బీసీసీఐ ఉంటుంది. బోర్డుతో పాటు అనుబంధ సంఘాలన్నింటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది’ అని సమాచార కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు తన 37 పేజీల ఉత్తర్వులో  పేర్కొన్నారు. 

ఆర్టీఐ చట్టాన్ని సమర్థంగా అమలు పరచడం కోసం 15 రోజుల్లోగా దరఖాస్తులు స్వీకరించే ఏర్పాట్లు చేసుకోవాలని, సమాచార అధికారులను కూడా నియమించుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, సీఓఏలకు ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. బీసీసీఐ ఏ మార్గదర్శకాల కింద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందో, భారత్‌కు ఆడే ఆటగాళ్లను ఎంపిక చేస్తోందో తెలపాలంటూ గీతారాణి అనే మహిళ చేసిన దరఖాస్తుతో ఇదంతా జరిగింది. టీమిండియా క్రికెటర్లు దేశం తరఫున ఆడుతున్నారా లేక ప్రైవేట్‌ సంఘం బీసీసీఐ తరఫున ఆడుతున్నారా అని ఆమె ప్రశ్నించింది. తమ దగ్గర తగిన వివరాలు లేవంటూ ఆమెకు కేంద్ర క్రీడాశాఖ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో సీఐసీ జోక్యం అనివార్యమైంది. అసాధారణ అధికారాలు ఉన్న బీసీసీఐ పనితీరు వల్ల ఆటగాళ్ల మానవ హక్కులకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని... ఇలాంటి అంశాలపై ఇన్నేళ్లుగా బోర్డును బాధ్యులుగా చేయాల్సి ఉన్నా సరైన నిబంధనలు లేక ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదని కూడా ఆచార్యులు అభిప్రాయ పడ్డారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా