బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం.. భారత క్రీడారంగంలో తొలి లీడర్‌గా..! 

5 Dec, 2023 10:45 IST|Sakshi

ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏ వ్యక్తికి దక్కని అరుదైన గౌరవం బీసీసీఐ కార్యదర్శి జై షాకు దక్కింది. షా.. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. స్పోర్ట్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, డాక్టర్‌ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబర్చినందుకు గాను ఈ ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. షా ఆధ్వర్యంలో ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌, దానికి ముందు శ్రీలంకలో ఆసియా కప్‌ జరిగిన విషయం తెలిసిందే. షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్‌ (WPL) పురుడుపోసుకుంది. ఇతని ఆధ్వర్యంలోనే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది.  

షా తన నాయకత్వ లక్షణాలతో ప్రపంచ క్రికెట్‌ను కూడా ప్రభావితం చేశాడు. ఇటీవల భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌-2023కు విజయవంతంగా నిర్వహించడం ద్వారా అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంలోనూ షా కీలకపాత్ర పోషించాడు. క్రికెట్‌కు అతను చేసిన ఈ సేవలను గుర్తించే కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (CII) ఉత్తమ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా ఎంపిక చేసింది. 

>
మరిన్ని వార్తలు