మూడో సారి ‘సూపర్‌’ 

22 Mar, 2019 01:15 IST|Sakshi

2018లో టైటిల్‌ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌  

ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు మళ్లీ ఈ ఏడాది బరిలో నిలిచాయి. పదేళ్ల పాటు సోనీ టెలివిజన్‌తో కొనసాగించిన లీగ్‌ బంధం ముగిసి ఈ ఏడాదినుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ హక్కులు దక్కించుకోవడం కీలక మార్పు. ఇందుకోసం స్టార్‌ ఏకంగా రూ.16,347 కోట్లు చెల్లించడం విశేషం. ఇదే సీజన్‌నుంచి ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టారు. లీగ్‌కు కొద్ది రోజుల ముందే బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్, స్టీవ్‌ స్మిత్‌ ఐపీఎల్‌కు దూరమయ్యారు. పునరాగమనంలో తన సత్తాను ప్రదర్శిస్తూ దూసుకుపోయిన ధోని సేన మూడో సారి ట్రోఫీని గెలుచుకొని ముంబై సరసన నిలిచింది. 

వాట్సన్‌ ఒంటి చేత్తో... 
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నైనే ఫైనల్‌కు కూడా అర్హత సాధించాయి. ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్‌ 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షేన్‌ వాట్సన్‌ (57 బంతుల్లో 111 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో 2 వికెట్లకు 181 పరుగులు చేసి చెన్నై విజయాన్నందుకుంది. సీజన్‌లో రెండు లీగ్‌ మ్యాచ్‌లతో పాటు తొలి క్వాలిఫయర్‌లో కూడా రైజర్స్‌ను ఓడించిన చెన్నై నాలుగో విజయాన్ని నమోదు చేయడం విశేషం.  

వాట్సన్‌ జోరు... 
టోర్నీలో మొత్తం ఐదు శతకాలు నమోదయ్యాయి. షేన్‌ వాట్సన్‌ రెండు సెంచరీలు సాధించగా... అంబటి రాయుడు, రిషభ్‌ పంత్, క్రిస్‌ గేల్‌ ఒక్కో సెంచరీ కొట్టారు. రిషభ్‌ పంత్‌ 68 ఫోర్లు, 37 సిక్సర్లు బాది రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలవడం విశేషం.  

మరిన్ని వార్తలు