ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణపై ఆందోళన

18 May, 2014 01:16 IST|Sakshi

రియో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. ఎప్పుడెప్పుడా అని విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆతృతగా ఈ మెగా టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక టోర్నీ జరిగే బ్రెజిల్‌లోనైతే ఈ జోరు మరింతగా ఉంది.
 
 అయితే ఇదంతా ఒకవైపే.. మరోవైపున ఈ వర్ధమాన దేశంలో ఇంత భారీ ఖర్చుతో టోర్నమెంట్ నిర్వహించడం అవసరమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతేగాకుండా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి శాంతి భద్రతల సమస్యగా మారింది. శుక్రవారం ఇదే కారణంగా వేలాది మంది నిరసనకారులు మ్యాచ్‌లు జరిగే సావో పాలో, రియో నగరాల్లోని రోడ్ల పైకి వచ్చారు.
 
  వీరిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి ప్రతిగా యువకులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు టైర్లను కాల్చుతూ రోడ్లను మూసివేశారు. బ్రెజిల్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ పేదరికం కూడా ఎక్కువగానే ఉందని, ఇలాంటి స్థితిలో 15 బిలియన్ల డాలర్ల (రూ.8 లక్షల 78 వేల కోట్లు) ఖర్చుతో ప్రపంచకప్ ఫుట్‌బాల్‌ను నిర్వహించడం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యయాన్ని ఇతర అవసరాలకు, గృహ నిర్మాణాలకు ఖర్చు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు