పంత్‌.. కాపీ చేసి ఒత్తిడిలో పడొద్దు’

19 Mar, 2020 14:34 IST|Sakshi

ధోని ఒక సూపర్‌ స్టార్‌: బ్రాడ్‌ హాడిన్‌

సిడ్నీ: గత కొంతకాలంగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నుంచి ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌ రాలేదు. భారత క్రికెట్‌ జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా పంత్‌ మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. అయితే టీమిండియాకే వేరు ప్రత్యామ్నాయమే లేనట్లు పంత్‌నే తుది జట్టులో కొనసాగిస్తోంది. ఈ తరుణంలో టీ20 వరల్డ్‌కప్‌ నాటికి పంత్‌ గాడిలో పడతాడా అనేది మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌.. పంత్‌ను కొన్ని సూచనలు చేశాడు.  పంత్‌ తన సహజ సిద్ధ శైలిలోనే ఆడాలని పేర్కొన్నాడు.

‘పంత్‌.. నువ్వు ఎవ్వర్నీ కాపీ కొట్టాలని ప్రయత్నించకు. నీకు సొంత గుర్తింపు తెచ్చుకో. నీకో శైలి ఉంది. దాన్నే కొనసాగించుకో. అందులో సాంకేతికంగా తప్పిదాలు ఉంటే సరి చేసుకో. అంతే గానీ మరొక క్రికెటర్‌ను కాపీ కొట్టడానికి యత్నించ వద్దు. అలా చేస్తే ఒత్తిడిలో పడటం తప్పితే ఉపయోగం ఉండదు. నేను ఆసీస్‌ తరఫున తొలి టెస్టు అవకాశం దక్కించుకున్నప్పుడు మాజీ వికెట్‌ కీపర్లు ఇయాన్‌ హీలే, ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌లను అనుసరించే ప్రయత్నం చేయలేదు. నా శైలిలోనే ఆటను ఆస్వాదించా. నువ్వు మరొక వికెట్‌ కీపర్‌ను కానీ బ్యాట్స్‌మన్‌ను కానీ అనుసరించే ప్రయత్నం చేయకు. అదే నీకు పెద్ద చాలెంజ్‌. ఒకవేళ వేరే ఒకర్ని నీలో ఉన్న సహజత్వం బయటకి రాకపోగా నీ అసలు ఆటకే ప్రమాదం వస్తుంది’ అని బ్రాడ్‌ హాడిన్‌ పేర్కొన్నాడు. 

ధోని ఒక సూపర్‌ స్టార్‌
ఒకవైపు పంత్‌కు సూచనలు ఇచ్చిన హాడిన్‌.. మరొకవైపు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోని ఒక సూపర్‌ స్టార్‌ అంటూ హాడిన్‌ కొనియాడాడు. దాదాపు దశాబ్దకాలానికి పైగా ధోని ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించడాన్నాడు. భారత్‌కు దొరికిని ఆణిముత్యం ధోని అంటూ పేర్కొన్నాడు. మరి ధోని వారసత్వాన్ని అందిపుచ్చుకునే మరే వికెట్‌ కీపరైనా వారి వారి సహజ సిద్ధ శైలినే అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని హాడిన్‌ తెలిపాడు. 


 

మరిన్ని వార్తలు