శ్రీలంకతో సిరీస్‌: స్టెయిన్‌ పునరాగమనం

12 Jun, 2018 19:45 IST|Sakshi

కేప్‌టౌన్‌ : వరుస గాయాలతో సతమతమవుతూ, కెరీర్‌ చరమాంకంలో ఉందనుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ తిరిగి జట్టులో స్థానం సాధించాడు. శ్రీలంకతో జులైలో జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం క్రికెట్‌ దక్షిణాఫ్రికా(సీఎస్‌ఏ) స్టెయిన్‌ గన్‌ను ఎంపిక చేసింది. న్యూలాండ్స్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ స్పీడ్‌స్టర్‌ గాయపడటంతో మిగిలిన టెస్ట్‌లకు, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో ఆ గాయం నుంచి కోలుకుని, కఠోర శ్రమతో ఫిట్‌నెస్‌ సాధించి సీఎస్‌ఏ దృష్టిలో పడ్డాడు. మోర్నీ మోర్కెల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో బౌలింగ్‌లో అనుభవలేమి సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో సీఎస్‌ఏ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టెయిన్‌కు స్థానం కల్పించారు. దీంతో పాటు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన కగిసో రబడా కోలుకోవడంతో జట్టులో స్థానం కల్పించారు.

స్టెయిన్‌ ఆనందం
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయడం పట్ల స్టెయిన్‌ అనందం వ్యక్తం చేశారు. జట్టులో స్థానం లభించిన తర్వాత స్టెయిన్‌ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ క్రికెట్‌లో అత్యున్నతమైన ఆట ఆడటానికి వయసు అడ్డంకి కాదని, పూర్తి ఫిట్‌నెస్‌ ఉన్నంతకాలం ఆడతానని ఈ ప్రొటీస్‌ బౌలర్‌ పునరుద్ఘాటించారు. దక్షిణాఫ్రికా తరుఫున అత్యధిక టెస్ట్‌ వికెట్లు(86 టెస్టుల్లో 422 వికెట్లు) సాధించిన స్పీడ్‌గన్‌ తాను ఇంకా సాధించాల్సిన లక్ష్యాన్ని తెలిపారు. ‘నా వయసు 35 సంవత్సరాలు, నేను కెరీర్‌లో సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నా టార్గెట్‌ 100 టెస్టులు ఆడాలి, 500 టెస్టు వికెట్లు సాధించాలి. అలాగే 2019 ప్రపంచకప్‌లో ఆడాలి. అవి సాధించడానికి వయసుతో సంబంధం లేకుండా కష్టపడతాను’అంటూ స్టెయిన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు