'నేను ఇంతలా మారడానికి నా భార్యే కారణం'

15 Feb, 2020 18:26 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి మనందరికీ తెలిసిందే. మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో బయట కూడా అంతే దూకుడుగా ఉంటాడు. స్లెడ్జింగ్‌ చేయడం, ప్రత్యర్థి ఆటగాడిని కవ్వించడంలో వార్నర్‌ తర్వాతే ఎవరైనా ఉంటారనడంలో సందేహం లేదు. ఇక మైదానం వెలుపల అతిగా మద్యం తాగి గొడవపడిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే బాల్ ట్యాంపరింగ్‌ అనంతరం మాత్రం వార్నర్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ తన దూకుడైన ఆటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మ్యాచ్ ఆరంభంలోనే విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. ఒంటిచేత్తో  జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే వార్నర్ తన ఆటతో కంటే వ్యక్తిగత చర్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.(‘దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి’)

2013లో జరిగిన యాషెస్ సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌తో ఒక పబ్‌లో ఘర్షణకు దిగాడు. రూట్‌పై భౌతిక దాడికి దిగి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. ఆ ఘటన అనంతరం దక్షిణాఫ్రికాలో క్వింటన్ డికాక్‌తోనూ వార్నర్ గొడవపడ్డాడు. ఇవన్నీ ఓ ఎత్తయితే.. స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌తో కలిసి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడం మరో ఎత్తు. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి 12 నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు.అయితే ఇవేమి వార్నర్ బ్యాటింగ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. పునరాగమనం తర్వాత ఐపీఎల్-12, ప్రపంచకప్‌-2019, యాషెస్ 2019, పలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తన బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. గతేడాదికి గాను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకాన్ని దక్కించుకున్నాడు.(ఇది కదా అసలైన ప్రతీకారం)

తాను ఇంతలా మారడానికి తన భార్య క్యాండీస్‌ ప్రోత్సాహం ఎంతో ఉందని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.' క్యాండీస్‌.. నాకున్న చెడు అలవాట్లను మాన్పించింది. నువ్వు ఎందుకు క్రమశిక్షణతో ఉండవు? ఎందుకు మద్యం తాగుతున్నావు? అంటూ హెచ్చరించేది. ఎందుకు త్వరగా లేవడం లేదు? అంటూ ప్రశ్నించేది. ఇక మద్యం తాగితే ఒక్కోసారి నా తల వెనక భాగంలో కొట్టేది (నవ్వుతూ). అలా నా భార్య నన్ను కంట్రోల్‌లో పెట్టింది. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లలో మద్యం తాగడం ఓ సంస్కృతి. సహచరులందరూ తాగినప్పటికీ.. క్యాండీస్ మాట వినడం తప్ప నాకు వేరే మార్గం లేదు. సరైన సమయంలో నా భార్యను వివాహం చేసుకొని మంచిగా మారిపోయాను. ఈ క్రెడిట్ అంత నా భార్యదే' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

>
మరిన్ని వార్తలు