మారడోనా అతి ఆనందం.. అస్వస్థత

27 Jun, 2018 15:12 IST|Sakshi
డిగో మారడోనా

మాస్కో : తమ అభిమాన జట్టు మ్యాచ్‌ ఆడుతుంటే మైదానంలో​ అభిమానులను ఆపడం ఎవరి తరం కాదు. అలాగే తమ జట్టుకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ అయి, అందులో నరాలు తెగే ఉత్కంఠంగా సాగే మ్యాచ్‌, విజయం సాధిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఆ అవధుల శృతి మించితే మాత్రం కొంచెం కష్టం. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌ అర్జెంటీనాకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సాకర్‌ సమరం నుంచి మెస్సీ సేన నిష్క్రమిస్తుంది. అలాంటి మ్యాచ్‌లో అర్జెంటీనా గోల్‌ కోట్టిన ప్రతీ సారీ అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. అభిమానుల కంటే ఎక్కువగా ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డిగో మారడోనాను ఆపడం అతడి స్నేహితులకు కూడా సాధ్యం కాలేదు.

మారడోనా వీఐపీ గ్యాలరీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్‌ వీక్షిస్తున్నాడు. మెస్సీ సేన అద్భుత ఆట తీరు ప్రదర్శించినా లేక గోల్‌ కోట్టిన ప్రతీసారి ఈ దిగ్గజం స్టాండ్‌పైకి ఎక్కి ప్రేక్షకులవైపు చేతితో అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. మ్యాచ్‌ ఆసాంతం ఉద్విగ్నభరితంగా గడిపిన మారడోనా అర్జెంటీనా విజయం అనంతరం అస్వస్థతకు లోనయ్యాడు. మ్యాచ్‌ అనంతరం కుర్చీలో నుంచి లేవలేకపోయాడు. స్నేహితుల సహాయంతో లేచి మైదానంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరాడు. ప్రసుతం ఈ దిగ్గజ ఆటగాడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ​కాగా మారడోనా చేసిన సంజ్ఞల ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ప్రవర్తించిన తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మారడోనా తక్షణమే ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు