రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్‌ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న లియోనల్‌ మెస్సీ

31 Oct, 2023 08:05 IST|Sakshi

దిగ్గజ ఫుట్‌బాలర్‌, ఇంటర్‌ మయామీ స్టార్‌, అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్‌ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు.

2009లో తొలిసారి బాలన్‌ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్‌ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్‌ సిటీ స్ట్రయికర్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్‌బాలర్‌నే వరించింది. పారిస్‌ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్‌కప్‌ అందించిన విషయం తెలిసిందే. 

మహిళల విభాగంలో ఎయిటనా బొన్‌మాటి..
మహిళల విభాగంలో బాలన్‌ డి'ఓర్ అవార్డును స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌, బార్సిలోనా సెంట్రల్‌ మిడ్‌ ఫీల్డర్‌ ఎయిటనా బొన్‌మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గెలిచిన స్పెయిన్‌ జట్టులో సభ్యురాలు. 

మరిన్ని వార్తలు