అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ  

9 Sep, 2023 03:16 IST|Sakshi

2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. బ్యూనస్‌ ఎయిర్స్‌లో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా 1–0తో ఈక్వెడార్‌ జట్టును ఓడించింది. 83 వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌లో ఆట 78వ నిమిషంలో కెపె్టన్‌ మెస్సీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 176 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెస్సీకిది 104వ గోల్‌ కావడం విశేషం.

వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో మెస్సీకిది 29వ గోల్‌. 29 గోల్స్‌తో లూయిస్‌ స్వారెజ్‌ (ఉరుగ్వే) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో కొలంబియా 1–0తో వెనిజులాపై గెలుపొందగా... పరాగ్వే–పెరూ మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’ అయింది. 2026 ప్రపంచకప్‌ను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 48 దేశాలు బరిలోకి దిగుతాయి.    

మరిన్ని వార్తలు