గోల్డ్ మెడల్ తెస్తా..సాయం చేయండి

21 Mar, 2016 17:16 IST|Sakshi
గోల్డ్ మెడల్ తెస్తా..సాయం చేయండి

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ పోటీల్లో  శిక్షణకోసం విరాళాలు కోరుతూ  భారత  వికలాంగ  సైక్లిస్ట్  జగ్విందర్ సింగ్  సోమవారం ఆన్ లైన్ లో ప్రచారం మొదలు పెట్టాడు.  క్రౌడ్ ఫండింగ్ ద్వారా పేదవాడినైన తనను ఆదుకోవాలని కోరాడు. ఇలా వచ్చే నిధుల ద్వారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలవాలని ఆశిస్తున్నట్లు డిజైర్డ్ వింగ్స్ డాట్ కామ్ లో   విజ్ఞప్తి చేశాడు.

పంజాబ్ పాటియాలా లోని  పత్రా అనే చిన్న గ్రామానికి చెందిన జగ్విందర్ అంతర్జాతీయ స్థాయిలో తనను  తాను తీర్చిదిద్దుకునేందుకు అంతర్జాతీయ  స్థాయిలో శిక్షణ కావాలని కోరుకుంటున్నాడు.  ఒక అంతర్జాతీయ స్థాయిలో పోటీ చెయ్యాలంటే  క్రీడాకారులకు  శిక్షణ, కోచింగ్, పోషణ తదితరాల అవసరమని అందుకే ఈ  నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.   అందరి  మద్దతుతో దీనికి అవసరమైన నిధులు సమకూరతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలవడం తన కల అని ఈ సందర్భంగా జగ్విందర్ పేర్కొన్నాడు. కెనడాకు చెందిన సైక్లిస్ట్ జోసెఫ్ వెలోస్ తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తానుకూడ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించి, దేశానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలన్న ఆశయంతో ఉన్నానని చెప్తున్నాడు.

2014 లో చండీగఢ్ అసోసియేషన్ నిర్వహించిన  పారా సైక్లింగ్ లో  రాష్ట్రం తరపున బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.  2015 లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ సైక్లోథాన్ లో  కాంస్య పతకం గెలుచుకున్నాడు.  2014 లో   గ్రీన్ బైకర్ అసోసియేషన్ ఆఫ్ పాటియాల నిర్వహించిన సైక్లోథాన్ లో 9 గంటల 15 నిమిషాల్లో 212 కిలో  పూర్తిచేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.  దీంతోపాటు  2000 లో చైల్డ్ వెల్ఫేర్ ఇండియన్ కౌన్సిల్  పోటీలో  ఆయన వేసిన కళాఖండాలు  బంగారు పతకాన్ని  గెల్చుకోవడం మరో విశేషం.
 

మరిన్ని వార్తలు